సారీ.. మా వల్లే 176 మంది అమాయకులు చనిపోయారు

సారీ.. మా వల్లే 176 మంది అమాయకులు చనిపోయారు

ఉక్రెయిన్ విమానం కూలిన ఘటనపై ఇరాన్ తన తప్పు ఒప్పుకుంది. జనవరి 8న టెహ్రాన్ నుంచి బయల్దేరిన ఉక్రెయిన్ ఫ్లైట్… కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 176 మంది చనిపోయారు. ఈ ప్రమాదం సాంకేతిక కారణాలతోనే జరిగిందని ఇరాన్ చెప్పుకొచ్చింది. అయితే లేటెస్ట్ గా మానవ తప్పిదం వల్ల తమ క్షిపణి విమానాన్ని కూల్చేసిందని, కావాలని చేసిన పని కాదని ఇరాన్ ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయింది. అమెరికాను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది ఇరాన్. అయితే ఉక్రెయిన్ విమానం శత్రువుదన్న ఉద్దేశంతో… దానిపై ఎటాక్ జరిగినట్లు తెలుస్తోంది. విమానాన్ని క్షిపణి ఢీకొన్న టైంలో ఓ మెరుపులా మెరిసింది. ఆ తర్వాత భారీ శబ్దంతో కూలిపోయింది.

ఈ ఘటనపై ఇరానీ హసన్ రౌహానీ స్పందించారు ‘మానవ తప్పిదంతో క్షిపణులు  ప్రయోగించడం వల్లే ఉక్రేనియన్ విమానం  ప్రమాదానికి కారణమయ్యాయి.తమ తప్పిదం కారణంగా 176 మంది అమాయకులు మరణించారు. క్షమించరాని తప్పిదంపై విచారణ వ్యక్తం చేస్తున్నాం‘అని అన్నారు.

టెహ్రాన్ లో జరిగిన ఈ ప్రమాదంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శత్రుదేశంగా భావించి కూల్చేసి ఉండవచ్చని అమెరికా, బ్రిటన్, కెనడా కామెంట్ చేశాయి. దర్యాప్తు చేసుకోవచ్చని ఇరాన్ కూడా ఉక్రెయిన్ కు సూచించింది. అయితే తాజాగా తమ కారణంగానే విమానం కూలిపోయిందని ఇరాన్ ఒప్పుకోవడంతో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారాయి.