బడంగ్​పేటలో మంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూల్చివేత

బడంగ్​పేటలో మంత్రి శంకుస్థాపన చేసిన శిలాఫలకం కూల్చివేత

పోలీసులకు ఫిర్యాదు చేసిన బడంగ్ పేట మున్సిపల్ కమిషనర్

ఎల్ బీనగర్, వెలుగు: దివ్యాంగుల భవనం కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసిన ఘటన  బడంగ్​పేట​ కార్పొరేషన్ పరిధి నాదర్​గుల్​లో జరిగింది. దీంతో మున్సిపల్ ​కమిషనర్   పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్​స్పెక్టర్​మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాదర్ గుల్ లోని సర్వే నం.78,79లో ఉన్న ఓ వెంచర్ లోని పార్క్ స్థలంలో దివ్యాంగుల కోసం భవనం నిర్మించేందులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత నెల14న శంకుస్థాపన చేశారు. కాగా ఆ శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం కూల్చివేశారు. 

దీంతో బడంగ్​పేట కమిషనర్  కృష్ణమోహన్ రెడ్డి మీర్ పేట్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా కూల్చివేసిన ఓ జేసీబీని గుర్తించారు. అయితే, ఇదే విషయంపై కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డిని వివరణ కోరగా అలాంటిదేమీ జరగలేదని ఆయన చెప్పడం గమనార్హం. ఆరునెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని మంత్రి సబితా శంకుస్థాపన సమయంలో పేర్కొన్నారు. కానీ ఇది ప్రైవేటు వెంచర్​లో ఉన్న పార్క్ స్థలం అవ్వడంతో అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ స్థలంలో దివ్యాంగుల భవనం నిర్మించి ఉంటే ఈ సమస్య ఇక్కడ వచ్చి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు.