ESI స్కామ్ : దేవికారాణి సహా నిందితులకు 14రోజుల రిమాండ్

ESI స్కామ్ : దేవికారాణి సహా నిందితులకు 14రోజుల రిమాండ్

ESI మందుల కొనుగోళ్ల అక్రమాల కేసులో ఏడుగురు నిందితులకు అక్టోబర్ 11వరకు హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ESI డైరెక్టర్ దేవికారాణి.. మరో ఆరుగురిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించింది. స్కామ్ దర్యాప్తులో భాగంగా… మొత్తం ఏడుగురు నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని… అందుకోసం వారిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ కు సంబంధించి… ESI మందుల స్కామ్ లో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

  1. డాక్టర్ దేవికారాణి, హైదరాబాద్ ESI డైరెక్టర్
  2. డాక్టర్ కె.పద్మ , వరంగల్ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్
  3. డాక్టర్ కె.వసంత ఇందిర, హైరాబాద్ ఈఎస్ఐ, అసిస్టెంట్ డైరెక్టర్ –స్టోర్స్
  4. ఎం.రాధిక, శంషాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీ గ్రేడ్ 2 ఫార్మసిస్ట్
  5. సీహెచ్.శివనాగరాజు, హైదరాబాద్ ఓమ్నీ మెడికల్ ప్రతినిధి
  6. వి.హర్షవర్ధన్, హైదరాబాద్ ఈఎస్ఐ RFDD సెక్షన్ సీనియర్ అసిస్టెంట్
  7. కె.శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ, హైదరాబాద్ ఓమ్నీ మెడికల్ ఎండీ

ESI స్కాం నిందితులపై ప్రివెన్షన్ ఆఫ్ కార్పస్ pc చట్టం కింద కేసు నమోదుచేసింది ఏసీబీ.  కోర్టు 14 రోజుల కస్టడీ విధించడంతో.. నిందితులను చంచల్ గూడ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. ఫోర్జరీ, చీటింగ్, క్రిమినల్ కాన్ స్పైరసీ, విధులు దుర్వినియోగం చేశారంటూ.. ఐపీసీ 120 (B) r/w 34,  477(A) 465, 468,  471, 420 సెక్షన్ ల కింద వీరిపై కేసులు నమోదయ్యాయి.

వారంరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ వేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈఎస్ఐ మందుల కొనుగోల్ మాల్ కుంభకోణంలో మొత్తం 11 మందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ తో పాటు వరంగల్ లోనూ గురువారం ACB  రైడ్స్ జరిగాయి. ఒకేసారి 23 చోట్ల  అధికారులు సోదాలు చేశారు. 17 మంది ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 10 కోట్ల రూపాయల వరకు  స్కామ్ జరిగినట్లు అంచనా వేస్తోంది. నకిలీ  బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.