
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 18వ తేదీ శనివారం ముంబైలో ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని "నిజమైన పార్టీలకు" కాకుండా, బీజేపీకి మద్దతు ఇచ్చే వర్గాలకు పార్టీ గుర్తులను ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని మండిపడ్డారు.
ద్రోహం, కుట్రల ఆధారంగా మహారాష్ట్రలోని అక్రమ ‘మహాయుతి’ ప్రభుత్వం ఏర్పడిందని, దానికి ప్రధానమంత్రి స్వయంగా మద్దతు ఇస్తున్నారని, మహారాష్ట్రలో ఆయన ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో చీలిక తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని ఖర్గే ఆరోపించారు. ప్రతిపక్ష భారత కూటమి అధికారంలోకి వస్తే రామాలయం మీదుగా బుల్డోజర్ నడుపుతుందని మోదీ.. ప్రజలను రెచ్చగొడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే చేస్తున్న ప్రధాని మోదీపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నింటికీ రక్షణ కల్పిస్తామని.. రాజ్యాంగాన్ని అనుసరిస్తామని ఖర్గే అన్నారు.