క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఈ పండుగ ఎంత ఫేమసో... ఆ రోజు (డిసెంబర్25) చేసుకునే కేక్ కూడా అంతే ఫేమస్. ఆ స్పెషల్ డే రోజు.. యమ్మీ యమ్మీ కేక్స్ తయారు చేసుకోండిలా.
పైనాపిల్ కేక్ తయారీకి కావాల్సినవి
- చక్కెర పొడి- ముప్పావు కప్పు
- చీజ్ - వంద గ్రాములు
- గుడ్లు- రెండు
- పైనాపిల్ జ్యూస్- రెండు టేబుల్ స్పూన్లు
- వెన్న- ఐదు టేబుల్ స్పూన్లు - +అర కప్పు
- చక్కెర - ఒక కప్పు
- పైనాపిల్ ముక్కలు- ఐదు
- పాన్ కేక్ మిక్స్- ఒక కప్పు
తయారీ విధానం : ఒక గిన్నెలో చక్కెర పొడి, చీజ్ వేసి బాగా కలపాలి. తర్వాత గుడ్లు కొట్టిపోసి మళ్లీ కలపాలి. అందులోనే పైనాపిల్ జ్యూస్, కరిగించిన వెన్న, పాన్ కేక్ మిక్స్ వేసి బాగా కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి, అర కప్పు వెన్న, చక్కెర వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్ గిన్నెలో వేయాలి. దానిపై పైనాపిల్ ముక్కలు పేర్చాలి. వాటిపైన కేక్ మిశ్రమం పోసి మూత పెట్టి.. ఆ గిన్నెను రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేయాలి. గంట తర్వాత కుక్కర్ గిన్నెను బయటకు తీస్తే పైనాపిల్ కేక్ రెడీ..
చాక్లెట్ కేక్ తయారీకి కావలసినవి
- మైదా పిండి-ముప్పావు కప్పు
- బేకింగ్ పౌడర్-ముప్పావు టీ స్పూన్
- ఉప్పు - చిటికెడు
- కొకోవా పొడి- మూడు టేబుల్ స్పూన్లు
- వెన్న (బట్టర్)- మూడు టేబుల్ స్పూన్లు
- చక్కెర - అర కప్పు
- గుడ్డు- ఒకటి
- నీళ్లు- పావు కప్పు
- పాలు-పావు కప్పు
- వెనిగర్ లేదా నిమ్మరసం- అర టీ స్పూన్
- వెనిల్లా ఎసెన్స్- అర టీ స్పూన్
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదాపిండి,ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి కలపాలి.. మరోగిన్నెలో వెన్న, చక్కెర. గుడ్డు సొన వేసి బాగా కలపాలి. తర్వాత. నీళ్లు, కొకోవా పొడి వేసి మిక్స్ చేయాలి. తరువాత వెనిగర్ లేదా నిమ్మరసం, వెనిల్లా ఎసెన్స్, పాలు ఒక్కొక్కటిగా వేస్తూ కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా పిండి వేస్తూ ఉండలు లేకుండా కలుపుతుండాలి.
కేక్ పాన్కి వెన్న రాసి, పిండిని అందులో వేయాలి. స్టవ్ పై ప్రెజర్ కుక్కర్ పెట్టి, అడుగుభాగంలో ప్లేట్ వేసి కొద్దిగా వేడి చేయాలి. తర్వాత కుక్కర్ లో కేక్ పాన్ పెట్టి మూత పెట్టాలి. మూతకున్న విజిల్, గ్యాస్మట్ని తీసేయాలి. రెండు నిమిషాలు కుక్కర్ వేడెక్కే దాకా మీడియం మంటపై ఉంచి, తర్వాత మంట చిన్నగా చేయాలి. నలభై నిమిషాల తర్వాత మూత తీసి, సన్నని పుల్లతో కేక్ గట్టిపడిందో లేదో చూడాలి. కేక్ రెడీ అయితే కుక్కర్లో నుంచిబయటికి తీయాలి.
ఫ్రూట్ కేక్ తయారీకి కావలసినవి
- మైదా పిండి- రెండు కప్పులు
- చక్కెర పొడి- రెండు కప్పులు
- వెన్న- వంద గ్రాములు
- గుడ్లు- రెండు
- బేకింగ్ పౌడర్- కొద్దిగా
- ఉప్పు - చిటికెడు
- వెనిల్లా ఎసెన్స్- ఒక టీస్పూన్
- టూటీ ఫ్రూటీ- రెండు టేబుల్ స్పూన్లు
- డ్రై ఫ్రూట్స్ (నెయ్యిలో వేగించిన జీడిపప్పు, కిస్మిన్)- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం : ఒక గిన్నెలో గుడ్లు కొట్టి పోయాలి. దాంట్లో వెన్న, చక్కెర పొడి వేసి బాగా కలపాలి. మైదా పిండి కూడా వేసి మిక్స్ చేయాలి. పిండి బాగా కలపడానికి పప్పుగుత్తితో తిప్పొచ్చు. తర్వాత టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ వేయాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన కేక్పాన్ లో వేయాలి. తర్వాత విజిల్, గ్యాస్కట్ తీసేసిన ప్రెజర్ కుక్కర్ అడుగుభాగంలో ఉప్పు వేసి వేడి చేయాలి. ఆ ఉప్పు మీద కేక్ పాన్ పెట్టి, కుక్కర్ మూత పెట్టాలి. గంటసేపు చిన్నమంటపై ఈ కేక్ ని ఉడికించాలి. అంతే, నోరూరించే ఫ్రూట్ కేక్ రెడీ..
