హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సొమ్ము దొచుకున్నరని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 8) గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి వివేక్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. పదేండ్లలో కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చారు కానీ బీద ప్రజలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డులు, మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకున్నామని.. అలాగే మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు.
