చెన్నై: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. గ్రూప్ డీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 8) ఎం. చిదంబరం స్టేడియం వేదికగా ఆప్ఘానిస్తాన్తో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో కాస్తా తడబడినా.. బ్యాటింగ్‌లో దుమ్మురేపి గెలుపు కైవసం చేసుకుంది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ (63) హాఫ్ సెంచరీతో దుమ్మురేపగా.. రహ్మానుల్లా గుర్బాజ్(27), సెదికుల్లా అటల్ (29), డార్విష్ రసూలి (20) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 2 వికెట్ల తీయగా.. హెన్రీ, జాకబ్ డఫీ, రచీన్ రవీంద్ర తలో వికెట్ తీశారు.
అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో ఛేధించింది. కివీస్ ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ (65) అర్ధ సెంచరీతో రాణించాడు. గ్లెన్ ఫిలిప్స్ 42 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో మిచెల్ (25), శాంటర్న్ (17) మెరుపులు మెరిపించి న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆప్ఘన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఓమర్జాయ్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తలో వికెట్ తీశారు.
