లగేజ్‌ లేని విమాన ప్రయాణికులకు టికెట్‌పై డిస్కౌంట్: DGCA

లగేజ్‌ లేని విమాన ప్రయాణికులకు టికెట్‌పై డిస్కౌంట్: DGCA

చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా దేశీయ విమాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అనుమతనిచ్చింది. దీనికి సంబంధించి ఓ సర్క్యులర్‌లో ప్రకటించింది. అవసరం లేకపోయినా స్నాక్స్, డ్రింక్స్, మీల్స్, లాంజ్ సర్వీసెస్ వంటి వాటి ద్వారా కూడా అదనంగా భారం పడుతోంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో DGCA స్పందించింది.

పాత నిబంధనల ప్రకారం క్యాబిన్ బ్యాగేజీ 7 కిలోలు, చెకిన్ బ్యాగేజీ 15 కిలోల వరకు ఉండొచ్చు. అది దాటితే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేవలం క్యాబిన్ లగేజీ లేదా అసలు లగేజీ లేకుండా ప్రయాణించే వారికి టికెట్లను తక్కువ ధరకు ఇచ్చే ఉద్దేశంతో DGCA ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. టికెట్ బుక్ చేసుకునే టైంలోనే లగేజీ బరువును తెలిపితే టికెట్ ధరలో డిస్కౌంట్ ఇస్తారు.

కేవలం డొమెస్టిక్ విమానాల్లోనే ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్ బుకింగ్ టైంలో క్యాబిన్ బ్యాగేజీని ఎంచుకుని, ప్రయాణ సమయంలో ఎక్కువ లగేజీని తెస్తే మాత్రం విమానయాన సంస్థల ధరలకు తగ్గట్టు చార్జీలు వసూలు చేస్తారని ప్రకటించింది. దాంతో పాటు సీటును ఎంపిక చేసుకునే వెసులుబాటునూ కల్పించింది. స్నాక్స్, డ్రింక్స్ చార్జీలు, ఎయిర్ లైన్ లాంజ్ సర్వీస్, క్రీడా పరికరాలు, సంగీత పరికరాల చార్జీలనూ టికెట్ ధరల నుంచి మినహాయించుకోవచ్చు. వీటితో చాలా మందికి అవసరం లేదని, చార్జీల ధరల నుంచి వాటిని మినహాయించాలని పలువురు ప్రయాణికులు కోరడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.