సానుభూతితో ఓట్లు వేయవద్దు

సానుభూతితో ఓట్లు వేయవద్దు

కులపోడని, వాడకట్టోడని, ఇంతకుముందు ఓడిపోయాడనే సానుభూతితో ఓటు వేయవద్దన్నారు మంత్రి ఈటల రాజేందర్. కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు.. జమ్మికుంట పట్టణంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు ఈటల.. కడుపులో తలపెట్టి అడుగుతున్నా జమ్మికుంట మున్సిపాల్టీలో  TRS కు సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు. జమ్మికుంటలో అభివృద్ధంతా TRS హయాంలోనే జరిగిందన్నారు.. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, హుజూరాబాద్, కోరపల్లి రోడ్లను నాలుగు లైన్లుగా మారుస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే జమ్మికుంటను సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. గుర్రాలు కట్టే పాకలా ఉన్న జమ్మికుంట జూనియర్ కాలేజీని రాజభవనాన్ని తలపించేలా కట్టించి పేద పిల్లలకు అంకితం చేశానని తెలిపారు.

ఓట్ల కోసం కొన్ని పార్టీల నాయకులు చెప్పే చెప్పుడు మాటలు నమ్మవద్దని కోరారు. విలీన గ్రామాల్లో టాక్స్ లు ఎక్కువ చేస్తామని పుకార్లు పుట్టిస్తారని అది నిజం కాదన్నారు. ప్రచారం లో భాగంగా ఈటల ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. 2008లో రాజీనామా చేసి గెలిచిన తర్వాత అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిని జమ్మికుంటకు మంచి నీళ్లు ఇవ్వమని అడిగితే.. మమ్మల్ని గెలిపించని వాళ్లకు నీళ్లెందుకని అన్నారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తేనే నీళ్లతో పాటు అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.