ఢిల్లీలో అమానుషం.. టెంపో డ్రైవర్, అతడి కొడుకుపై పోలీసుల దాడి

ఢిల్లీలో అమానుషం.. టెంపో డ్రైవర్, అతడి కొడుకుపై పోలీసుల దాడి

ఢిల్లీలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఓ టెంపో డ్రైవర్, అతని కొడుకును రోడ్డుపైనే చితక్కొట్టారు. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ముఖర్జీనగర్ లో ఈ ఘటన జరిగింది.

టెంపో వెహికల్… పోలీస్ వాహనాన్ని డీకొట్టిందని… తమ ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఓ పోలీస్ కాలుపై నుంచి టెంపో వెళ్లిందని తెలిపారు. ప్రశ్నించినందుకు కత్తి తీసి ఎదురు తిరిగారంటూ అంటూ పోలీసులు చెప్పారు.

పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆ సిక్కువ్యక్తిని, అతడి కొడుకును పట్టుకుని దాడి చేశారు. నడిరోడ్డుపై కిందపడేసి చితకబాదారు. ఇది కెమెరాల్లో రికార్డ్ అయింది.

డ్రైవర్ కొడుకును కూడా వదల్లేదు పోలీసులు. తమనే అడ్డుకుంటావా అంటూ చితకబాదారు. నడిరోడ్డుపై అతడిని కాళ్లు, రెక్కలు పట్టి.. ఈడ్చుకుంటూ వెళ్లారు. అతడి ముఖంపై ఓ పోలీసు తన్నుతూ ఈడ్చుకెళ్లాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మరింతమంది అక్కడకు వచ్చారు. ఈ సమయంలో తన దగ్గరున్న కత్తిని.. ఆ సిక్కు వ్యక్తి మరోసారి చూపించడంతో ఉద్రిక్తత పెరిగింది. భయంతో పోలీసులు వెనక్కి పరుగెత్తారు. మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ అధికారి వెనుకనుంచి ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. పట్టుచిక్కడంతో.. మిగతా పోలీసులు రెచ్చిపోయారు. లాఠీలకు పనిచెప్పారు.

ఈ సంఘటనలో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. ఆ ఇద్దరూ అరెస్టయ్యారు. ఆ తర్వాత గొడవ మరింత ముదిరింది. పోలీస్ వాహనాలపై కొందరు దాడిచేశారు.

ఈ సంఘటనపై సిక్కులు సీరియస్ అవుతున్నారు.  రాజౌరి గార్డెన్ ఎమ్మెల్యే మంజిందర్ ఎస్ సిర్సా ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి న్యాయం కోరడంతో ఈ విషయం రాజకీయ మలుపు తీసుకుంది. ఢిల్లీ పోలీసులు ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు సిక్కులు. పోలీసులు దురుసు ప్రవర్తన కారణంగా.. గొడవ పెరిగిందని అన్నారు.

ఈ పోలీసుల తీరును ఖండించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఘటన దురదృష్టకరమన్న కేజ్రీవాల్… పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంశాఖను కోరారు. టెంపో డ్రైవర్ పై దాడి చేసిన ముగ్గురు పోలీసుల్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.