మళ్లీ అప్పుల వైపు బల్దియా చూపు

మళ్లీ అప్పుల వైపు బల్దియా చూపు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రూపాయీ అందకపోవడంతో బల్దియా మళ్లీ అప్పుల వైపు చూస్తోంది. ఇప్పటికే రూ.5,275 కోట్ల అప్పులు చేసిన జీహెచ్ఎంసీ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమవుతోంది. కేటాయించాలని ఏటా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫండ్స్ ​రాకపోతుండటంతో అప్పులు చేసి జీహెచ్ఎంసీని నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో సందర్భంలో ఉద్యోగుల జీతాలు కూడా టైమ్ కు అందడం లేదు. బల్దియా ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నయాపైసా రాకపోవడంతో ఆ పనులను పూర్తిచేసేందుకు అప్పులు చేయక తప్పడం లేదు. నిధులు ఇవ్వకపోవడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులను అమ‌‌లు చేయాలంటూ బ‌‌ల్దియాపై భారం పెంచుతోంది. దీంతో జీతాలు ఒకవైపు, మ‌‌రో వైపు మెయింటెనెన్స్ పనులను చేయడం కూడా బల్దియాకు క‌‌ష్టంగా మారింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ), కాంప్రహెన్సివ్ రోడ్​ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పనులకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో మరోసారి అప్పు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా సిటిలో రోడ్లను డెవలప్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ నుంచి మంత్రుల వరకు పదేపదే చెబుతున్నప్పటికీ ఆ పనులకు కావాల్సిన నిధులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. అన్ని జీహెచ్ఎంసీపైనే వేయడంతో రోజురోజుకు అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు మిగులు బడ్జెట్​తో ఉన్న బల్దియాకు ఇప్పుడు డైలీ రూ. కోటికిపైగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీకి బడ్జెట్​లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి ప్రభుత్వం నుంచి అందడం లేదు. కానీ, సిటీలో పనులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అప్పులు చేసి ఆ పనులను పూర్తి చేయాల్సి వస్తోంది. నిధులు కావాలంటూ జీహెచ్ఎంసీ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని బల్దియా వర్గాలు చెబుతున్నాయి. 

ఫండ్స్​ ఉంటేనే పనులు ...

గ్రేటర్ లో కొనసాగుతున్న ఎస్​ఆర్డీపీ పనులు కొన్నిచోట్ల ఇప్పటికే స్లోగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీకి ఈ ప్రాజెక్ట్ పెద్ద భారమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లో ఫేజ్–1లో భాగంగా 30 పనులు పూర్తిగా కాగా, మరో 14 పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అప్పులు చేసేందుకు సిద్ధమైంది కూడా ఈ పనుల కోసమేనని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ వద్ద నిధులు లేకపోవడంతో ప్రాపర్టీ ట్యాక్స్​ను సైతం ఎర్లీబర్డ్ పేరుతో ముందస్తుగా కలెక్ట్ చేస్తున్నారు. వన్ టైమ్ సెటిల్ మెంట్​ స్కీమ్ పేరుతోనే ఆదాయాన్ని రాబడుతున్నారు. ప్రస్తుతం మెయింటెనెన్స్ పనులు చేసేందుకు కూడా నిధులు లేవు. చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు అందడం లేదు. రూ. వెయ్యి కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 

రూ.10 వేల కోట్లు ఇవ్వాలె .. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం.. బల్దియాకు సరిపడా ఫండ్స్​ ఇవ్వడం లేదు. ఇచ్చిన నిధులు మెయింటెనెన్స్ కు కూడా పరిపోవడం లేదు. కోటికి పైగా జనాభా ఉన్న గ్రేటర్ కు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే ఎట్ల. జీహెచ్ఎంసీ చెల్లిస్తున్న వడ్డీ డబ్బులతో ఎంతో డెవలప్ చేయొచ్చు. ఇప్పటివరకు బల్దియా చేసిన అప్పులను ప్రభుత్వం వెంటనే చెల్లించడంతో పాటు అదనంగా నిధులు విడుదల చేయాలె. గ్రేటర్ సిటీకి రూ.10 వేల కోట్లు ఇవ్వాలంటూ గతంలో బడ్జెట్​ సమావేశాల సమయంలో ప్రభుత్వాన్ని కూడా కోరాం. కానీ కేటాయించలేదు. 

- ఎం.పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ