హుజురాబాద్‌లో ఈటల ఘన విజయం

హుజురాబాద్‌లో ఈటల ఘన విజయం

హుజురాబాద్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 23,855 వేల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలో రౌండ్ రౌండ్ కు ఆధిక్యాన్ని కొనసాగించారు ఈటల.  8,11 రౌండ్లలో  టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగించగా.. మిగతా అన్ని రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించారు ఈటల.హుజురాబాద్ లో మొత్తం 2,37,036 ఓట్లు కాగా..ఇందులో 2,05,236 పోలయ్యాయి. ఇందులో  ఈటలకే 1,07,022 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 83,167 ఓట్లు పోలయ్యాయి.

హుజురాబాద్ లోని ఐదు మండలాల్లో దాదాపు ఈటలనే పై చేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంక మండలంలోనూ ఈటలనే ఆధిక్యం సాధించారు. సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ విజయంతో వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల. మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.

హుజురాబాద్ లో వందల కోట్ల అభివృద్ధి పనులు... దళితబంధు పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి  పది లక్షలు.. విచ్చలవిడిగా మద్యం,డబ్బుల పంపిణీ... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ నెలల తరబడి హుజురాబాద్ లోనే మకాం.. ఇంటింటికీ తిరిగి ప్రచారం ... ఇవన్నీ  బైపోల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించలేకపోయాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. బైపోల్ ఎన్నికల్లో ఈటలను ఓడించడానికి అధికార పార్టీ అన్నీ అస్త్రాలను ప్రయోగించింది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత ఆయనకు అండగా నిలిచిన హుజురాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలందరినీ తమవైపు తిప్పుకున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇందుకోసం,పదువుల ఆశచూపించడంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు  చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. సొంత పార్టీ నేతలనే టీఆర్ఎస్ కొనుగోలు చేసిందన్న విమర్శలు వచ్చాయి.గతంలో ఈటలపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడంతో పాటు ఆయనను నామినేటెడ్ ఎమ్మెల్సీ గా గవర్నర్ కు సిఫార్స్ చేసింది. బైపోల్ ఎన్నిక కోసం దళితబంధు స్కీంను ప్రారంభించింది.ఇన్నీచేసినా నియోజకవర్గంలో ఈటల రాజేందర్ విజయం సాధించి  తన పట్టు నిలుపుకున్నాడు.