దేశంలో భారీగా పెరిగిన హోమ్‌‌‌‌ లోన్లు ..రెండేండ్లలో 10 లక్షల కోట్లు

దేశంలో భారీగా పెరిగిన హోమ్‌‌‌‌ లోన్లు ..రెండేండ్లలో 10 లక్షల కోట్లు
  • ఇండ్ల సేల్స్, ధరలు  పెరగడమే కారణం 
  • హోమ్ లోన్లు మరింత పెరుగుతాయని అంచనా

న్యూఢిల్లీ: దేశంలో హోమ్‌‌‌‌ లోన్లు భారీగా పెరిగాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఫైనాన్షియల్ కంపెనీలు ఏకంగా రూ.10 లక్షల కోట్ల ఇండ్ల లోన్లు ఇచ్చాయని  రిజర్వ్ బ్యాంక్‌‌‌‌  ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. మొత్తం హోమ్ లోన్ల బకాయిలు (ఔట్‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌– ఇంకా అప్పు తీరనవి) ఈ ఏడాది మార్చి నాటికి రూ.27.23 లక్షల కోట్లకు చేరుకున్నాయని వెల్లడించింది. 

కరోనా సంక్షోభం తర్వాత రియల్‌‌‌‌ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుందని, ఇండ్లకు డిమాండ్ పెరిగిందని  బ్యాంకింగ్‌‌‌‌, రియల్ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని నిపుణులు చెబుతున్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి నాటికి హౌసింగ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు  బ్యాంకులు ఇచ్చిన లోన్లు (ఔట్‌‌‌‌స్టాండింగ్‌‌‌‌)  రూ.27,22,720 కోట్లుగా ఉన్నాయి. కిందటేడాది మార్చి నాటికి ఈ నెంబర్ 19,88,532 కోట్లుగా, అంతకు ముందు ఏడాది మార్చి నాటికి రూ.17,26,697 కోట్లుగా రికార్డయ్యింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇండ్ల ధరలు పెరిగాయి. అదే టైమ్‌‌‌‌లో సేల్స్‌‌‌‌ కూడా  ఊపందుకున్నాయి. 

కరోనా తర్వాత ఒక్కసారిగా..

హోమ్‌‌‌‌ లోన్లు పెరగడానికి ముఖ్య కారణం హౌసింగ్ బూమ్‌‌‌‌ అని  బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్‌‌‌‌ మదన్ సబ్నవిస్ అన్నారు. ప్రభుత్వ జోక్యంతో  అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్‌‌‌‌ ఊపందుకుందని  వివరించారు. ‘ కరోనా సంక్షోభం తర్వాత పెంటప్ డిమాండ్‌‌‌‌తో ఇండ్ల అమ్మకాలు పెరిగాయి’ అని పేర్కొన్నారు.  హోమ్‌‌‌‌ లోన్లు పెరుగుతున్నాయని, కానీ ఇండ్ల ధరలు పెరగడంతో వీటి గ్రోత్‌‌‌‌  15–20 శాతం దగ్గర  ఆగిపోతుందని  ఆయన అంచనా వేశారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో  చాలా ప్రాపర్టీలు లాంచ్ అయ్యాయని, అమ్ముడయ్యాయని, అందుకే హోమ్‌‌‌‌ లోన్లు పెరిగాయని ప్రాప్‌‌‌‌ఈక్విటీ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ జాసుజా అన్నారు. 

2020–21 తర్వాత చూస్తే  టైర్ 1 సిటీల్లో ఇండ్ల ధరలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయని అన్నారు.  దీంతో ప్రాపర్టీల యావరేజ్‌‌‌‌ లోన్ సైజ్ కూడా పెరిగిందని వివరించారు. రెసిడెన్షియల్ ఇండ్లకు డిమాండ్ కొనసాగుతుండడంతో హౌసింగ్ లోన్లు మరింత పెరుగుతాయని జాసుజా అన్నారు.  సిమెంట్‌‌‌‌, స్టీల్‌‌‌‌ వంటి 200 అనుబంధ రంగాలను సపోర్ట్ చేస్తున్న ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్  2022 నుంచి  అప్‌‌‌‌ట్రెండ్‌‌‌‌లో ఉంది. అంతకు ముందు రెరా, జీఎస్‌‌‌‌టీ, డీమానిటైజేషన్‌‌‌‌తో ఇబ్బందులు పడింది. చాలా మంది డెవలపర్లు కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకొని ప్రాజెక్టులను సకాలంలో డెలివరీ చేసేవారు కాదు. కానీ, 2020 లోని కరోనా సంక్షోభం తర్వాత  రియల్ ఎస్టేట్ సెక్టార్ పుంజుకుందని చెప్పొచ్చు. దేశంలోని రియల్ ఎస్టేట్‌‌‌‌ సెక్టార్‌‌‌‌ సైజ్‌‌‌‌‌‌‌‌ 20‌‌‌‌‌‌‌‌30 నాటికి ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్ల డాలర్లకు) చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

12 శాతం గ్రోత్‌‌‌‌తో..

బ్యాంకులు ఇస్తున్న హోమ్‌‌‌‌ లోన్లు 20‌‌‌‌‌‌‌‌23–24 లో పెరిగాయని,  హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్  విలీన ప్రభావం దీనిపై ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్‌‌‌‌ శ్రీనివాసన్‌‌‌‌ అన్నారు. మోర్టగేజ్‌‌‌‌ (తనఖా) లకు ప్రజలు అలవాటు అవుతున్నారని, ఈ ఏడాది మార్చి నాటికి  దేశంలోని 12 శాతం మంది మోర్టగేజ్ లోన్లు తీసుకున్నారని  ఆయన వెల్లడించారు. కానీ, డెవలప్ అయిన దేశాలతో పోలిస్తే ఇంకా ఇది తక్కువగానే ఉందన్నారు. 

వృద్ధి చెందడానికి బోలెడు అవకాశాలు ఉన్నాయని  పేర్కొన్నారు.  హౌసింగ్ లోన్లు ఏడాదికి 12–14 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని ఇక్రా అంచనా వేస్తోంది. గత రెండేళ్లలో ఇండ్లకు డిమాండ్ పెరిగిందని, ఆల్ టైమ్ హైకి చేరుకుందని  డీఎల్‌‌‌‌ఎఫ్‌‌‌‌ హోమ్‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌ ఆకాశ్‌‌‌‌ ఓహ్రీ అన్నారు. ప్రభుత్వ పాలసీలు,  వివిధ ఫైనాన్షింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉండడం,  ఇల్లు కొనుక్కోవడంపై ప్రజల్లో ఆసక్తి పెరగడం వంటి అంశాలు హోమ్‌‌‌‌ లోన్లు పెరగడానికి కారణమని   అభిప్రాయపడ్డారు.