హైదరాబాద్ లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కేంద్రంగా ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆస్తులు, స్థలం దుర్వినియోగం అవుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో, సినీ పెద్దలు నిరసనకు దిగారు. 'సేవ్ ఫిల్మ్ ఛాంబర్, బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' (Save Film Chamber, Bring Back the Glory) పేరుతో సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అగ్ర నిర్మాతలు, నటులు మురళీ మోహన్, సురేష్ బాబు, అలాగే శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ ఛాంబర్ స్థలం పరిశ్రమ అవసరాలకే ఉపయోగించాలని డిమాడ్ చేశారు...
ఫిల్మ్ ఛాంబర్ స్థలం పరిశ్రమ అవసరాలకే..
ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు (చెన్నై) నుండి హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో, ఫిల్మ్ నగర్ సొసైటీలో ఫిల్మ్ ఛాంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని నిర్మాత సురేష్ బాబు గుర్తు చేశారు . ఇక్కడి స్థలం పూర్తిగా చిత్ర పరిశ్రమ అవసరాల కోసమే ఉపయోగపడాలన్నారు. ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించరాదు అని ఆయన స్పష్టం చేశారు.
40 ఏళ్ల నాటి నిర్మాణం, వేరేవాటికి వాడొద్దు
చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చినందుకు గాను ఫిల్మ్ నగర్ సొసైటీలో ఈ ఛాంబర్‌ను కేటాయించారని సినీ నిర్మాత, నటుడు మురళీ మోహన్ తెలిపారు. ఇది కట్టి దాదాపు 40 ఏళ్లు దాటిందని అన్నారు. ఈ స్థలాన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవసరాలకు తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదు. ఈ విషయంలో అందరికీ ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతే కొత్త భవనాల నిర్మాణం గురించి ఆలోచించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
అభివృద్ధి పరిశ్రమకే ఉపయోగపడాలి'
సినీ పరిశ్రమ ఇక్కడే స్థిరపడటం కోసం ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన నిర్మాత అశోక్ కుమార్ అన్నారు. కాలక్రమేణా, నిర్మాతల సౌకర్యాల కోసం, పరిశ్రమ కార్యకలాపాల కోసం అనేక ఆఫీసులు ఈ కాంప్లెక్స్‌లో ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి జరిగితే, అది పూర్తిగా చిత్ర పరిశ్రమకే ఉపయోగపడేలా ఉండాలి. ఫిల్మ్ ఛాంబర్ అభివృద్ధిపై సినీ పెద్దలందరూ కలిసికట్టుగా, అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి అని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా సినీ వర్గాల ఆవేదనను అందరికీ తెలిసేలా గట్టి సందేశం ఇచ్చారు.
►ALSO READ | Samantha: 'మా ఇంటి బంగారం' నిర్మాతగా రాజ్ నిడిమోరు.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్ !
