Samantha: 'మా ఇంటి బంగారం' నిర్మాతగా రాజ్ నిడిమోరు.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

Samantha: 'మా ఇంటి బంగారం' నిర్మాతగా రాజ్ నిడిమోరు.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల గురించి ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల ఆమె దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో ఆమె తన సన్నిహితుడు, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సందడి చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌ గురించి గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మాత్రం ఎవరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

నందిని రెడ్డితో రెండో సినిమా..

లేటెస్ట్ గా సమంత తన కెరీర్‌కు సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.  సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం' కు సంబంధించిన పూజా కార్యక్రమం దసరా సందర్భంగా ఘనంగా జరిగింది. ముహూర్తం షాట్‌తో ఈ సినిమా షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు క్లాప్ కొట్టగా సినిమా షూటింగ్ స్టార్ చేశారు. ఈ ప్రత్యేకమైన పూజా కార్యక్రమం వీడియోను సమంత తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌' రెండో ప్రాజెక్ట్

సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో ఇది రెండో చిత్రం కావడం విశేషం. వీరిద్దరూ కలిసి అంతకుముందు చేసిన 'ఓ బేబీ' (2019) చిత్రం కమర్షియల్‌గా, విమర్శనాత్మకంగా మంచి విజయాన్ని సాధించింది. దీంతో, ఈ కొత్త చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థ అయిన ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థను స్థాపించిన తర్వాత సామ్ నిర్మిస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇది. గతంలో, ఈ బ్యానర్ కింద వచ్చిన తొలి చిత్రం 'శుభం'లో ఆమె అతిథి పాత్రలో మెరిసింది.

సహ నిర్మాతగా రాజ్ నిడిమోరు..

అంతే కాదు ఈ కొత్త చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, అలాగే హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ నిడిమోరు, సమంత గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో పాటు, రాబోయే హిందీ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌' (సిటడెల్ ఇండియన్ వెర్షన్)లో కూడా కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ భాగస్వామ్యం కూడా చేరడం వీరి మధ్య ఉన్న వృత్తిపరమైన బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఎమోషనల్ పోస్ట్.. వైరల్ 

తన కొత్త సినిమా ప్రారంభం గురించి సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రేమ, ఆశీర్వాదాల మధ్య #MaaIntiBangaram ముహూర్తంతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మేము ఏం సృష్టిస్తున్నామో మీతో పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నాం... ఈ ప్రత్యేకమైన సినిమాను ప్రారంభిస్తున్నందున మీ అందరి ప్రేమ, మద్దతు మాకు కావాలి." అని కోరింది.

ప్రస్తుతం సమంత ఈ సినిమాతో పాటు, హిందీ వెబ్ సిరీస్ ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. 'మా ఇంటి బంగారం' ద్వారా సమంత ప్రేక్షకులకు ఎలాంటి విభిన్నమైన వినోదాన్ని అందిస్తారో చూడాలి. ఈ ముహూర్తం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.