నల్గొండ: ఆడపిల్ల పుట్టిందనే కారణంతో అసంతృప్తితో ఉండే కొందరు పేదల ఆర్ధిక అవసరాలను క్యాష్ చేసుకునేందుకు ఒక ముఠా రంగంలోకి దిగింది. నల్గొండ జిల్లా నుంచి ఏపీకి గుట్టు చప్పుడు కాకుండా శిశు విక్రయాలను చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. తాజాగా.. తిరుమలగిరి సాగర్ (మండలం) ఎల్లాపురం తండాలో శిశు విక్రయం కలకలం రేపింది.
ఓ గిరిజన దంపతులకు నలుగురు ఆడపిల్లలు పుట్టారు. మూడు, నాలుగో సంతానంగా పుట్టిన ఇద్దరు చిన్నారులను మధ్యవర్తుల ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన వారికి తల్లిదండ్రులు అమ్మేశారు. చెల్లిని అమ్మొద్దని ఇద్దరు అమ్మాయిలు తల్లి కాళ్ళ మీద పడ్డ దృశ్యాలు కలచివేశాయి.
పేగు బంధం కాదనుకుని, కడుపు తీపిని మరిచి కన్న బిడ్డను అమ్మేసుకున్న తల్లిదండ్రులపై నెటిజన్లు భగ్గుమన్నారు. మగ పిల్లలపై మమకారంతో నలుగురు ఆడ పిల్లలను కనేసి, కన్నబిడ్డలను కాసుల కోసం అమ్మేసిన ఘటన చర్చనీయాంశమైంది. ముక్కుపచ్చలారని చిరుప్రాయానికి వెల కడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. అన్నెం పున్నెం ఎరుగని బాల్యాన్ని అంగట్లో సరుకును చేస్తున్నారు. కంటికి రెప్పలా సాకాల్సిన కన్నబిడ్డలను డబ్బులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారు.
ఒకరి నుంచి మరొకరికి బిడ్డలు చేతులు మారుతూ వెలను మారుస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మధురమైన బాల్యానుభూతి కర్కశుల చేతుల్లో ఆహుతి అవుతోంది. కల్మషం లేకుండా విచ్చుకునే పసి మనస్సులకు పాపభీతిని అంటగడుతున్నారు. తల్లిదండ్రుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని కొనుగోలు చేసిన పిల్లలను కఠినమైన జీవితానికి బలి చేస్తున్నారు. మారుమూల గిరిజన తండాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆడ శిశువుల అమ్మకాలు, భ్రూణ హత్యలు, పుట్టిన వెంటనే చెట్ల పొదల్లో వదిలివేస్తూ సమాజానికి వేదన కలిగిస్తున్నారు. నిరక్షరాస్యత, పేదరికం మూలంగా దశాబ్ద కాలంగా పిల్లల విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. అమ్మినా, కొనుగోలు చేసినా నేరమని చట్టాలు చేసినప్పటికీ కొందరు తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావడం లేదు.
