- కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి
న్యూఢిల్లీ, వెలుగు: యాసిడ్ దాడికి ప్రయత్నించినా సరే.. నిందితులకు 5 నుంచి 7 ఏండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి స్పష్టం చేశారు. ఇందుకోసం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)–2023 ప్రకా రం కఠినమైన శిక్షలు అమలులో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కొత్తగా అమలులోకి వచ్చిన చట్టంలోని సెక్షన్ 124(1) ప్రకారం యాసిడ్ దాడికి పాల్పడితే పదేండ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని పేర్కొన్నారు. అలాగే కోర్టు విధించే జరిమానా మొత్తాన్ని బాధితుల వైద్య ఖర్చుల కోసం చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.
