- ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీలు., 260 వార్డులు
- 10 మున్సిపాలిటీల్లో 50 వార్డులకు కలిసొచ్చిన బీసీ రిజర్వేషన్లు
- 119 మంది బీసీ అభ్యర్థులకు అవకాశమిచ్చిన అధికార కాంగ్రెస్
- పొత్తుల రూపంలో ఇతర పార్టీల నుంచి మరికొందరికి అవకాశం
వరంగల్, వెలుగు: ఓరుగల్లు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ జపం అందుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో 12 మున్సిపాలిటీలు ఉండగా, 260 వార్డులున్నాయి. ఈసీ రిజర్వేషన్ల ప్రకారం 2 మున్సిపాలిటీల్లో బీసీలకు అవకాశం లేదు.
మిగతా 10 మున్సిపాలిటీల్లో 50 వార్డులు అధికారికంగా బీసీలకు దక్కాయి. మిగతా 210 స్థానాలు ఎస్సీ, ఎస్టీ, జనరల్‍కు కేటాయించారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‍ఎస్, బీజేపీ ఏకంగా 354 మంది బీసీలకు బీఫారాలు అందించాయి. మూడు ప్రధాన పార్టీలు బీసీ రిజర్వేషన్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ బీసీలకు జై కొట్టాయి.
మూడు పార్టీల్లోనూ ప్రాధాన్యం
ఓరుగల్లులోని 6 జిల్లాల పరిధిలో 12 మున్సిపాలిటీలున్నాయి. ఇందులో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, ములుగు, జనగామ, స్టేషన్ ఘనపూర్, తొర్రూర్, కేసముద్రం, మహబూబాబాద్‍తో కలిపి 10 మున్సిపాలిటీల పరిధిలో 230 వార్డులు ఉండగా, 50 వార్డుల్లో బీసీలకు రిజర్వేషన్ కలిసివచ్చింది. మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీ బీసీలకు రిజర్వేషన్లు కలిసిరాలేదు.
మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీ డైరెక్టుగా 119 మంది బీసీలకు అవకాశం ఇవ్వగా, పలు మున్సిపాలిటీల్లో పొత్తుల రూపంలో సీపీఐ, సీపీఎం పార్టీల తరఫున మరికొందరికి అవకాశం కల్పించింది. బీఆర్‍ఎస్ 122 మందికి కారు గుర్తుపై పోటీచేసే అవకాశమివ్వగా, బీజేపీ 113 మంది బీసీలకు టిక్కెట్లు కేటాయించింది.
జనరల్ స్థానాల్లోనూ చాయిస్..
కాంగ్రెస్, బీఆర్‍ఎస్, బీజేపీలు 12 మున్సిపాలిటీల పరిధిలో కేవలం బీసీ రిజర్వేషన్లు ఉన్నచోటనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ బీసీలకు టిక్కెట్లు కేటాయించారు. 50 స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండగా, మూడు పార్టీల నుంచి 150 మందికి మాత్రమే అవకాశం దక్కేది. కానీ 354 మంది బీసీలు ప్రధాన పార్టీల టిక్కెట్లు దక్కించున్నారు.
ఈ లెక్కన మూడు రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లోనూ బీసీలకు సముచిత గౌరవం ఇచ్చాయి. డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపరంగా బీసీలకు పోటీచేసే అవకాశం లేదు. అయినా మూడు పార్టీలు జనరల్ స్థానాల్లో 14 మంది బీసీలను పోటీ చేసేలా తమ పార్టీల నుంచి
అవకాశమిచ్చాయి.
పార్టీల వారీగా బీసీలకు కేటాయించిన టికెట్ల సంఖ్య వివరాలు..
మున్సిపాలిటీ(వార్డులు) బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ బీఆర్‍ఎస్ బీజేపీ
నర్సంపేట (30) 08 15 18 16
వర్ధన్నపేట (12) 01 02 02 01
పరకాల (22) 05 11 11 13
భూపాలపల్లి (30) 07 14 18 14
ములుగు (20) 05 12 15 13
జనగామ (30) 09 20 18 16
స్టేషన్ ఘణపూర్ (18) 03 11 10 07
తొర్రూర్ (16) 03 08 06 08
మరిపెడ (15) _ _ 01 03
డోర్నకల్ (15) _ 04 04 02
కేసముద్రం (16) 03 07 05 07
మహబూబాబాద్ (36) 06 15 14 13
మొత్తం వార్డులు (260) 50 119 122 113
