కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు అడిగేందుకు ఓ ఇంటికి వెళ్లిన క్యాండిడేట్‌కు విచిత్రమైన డిమాండ్ ఎదురైంది. కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ క్యాండిడేట్ బుధవారం దేవునిపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లోకి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కుటుంబ సభ్యులను అభ్యర్థించారు.
దీంతో ‘మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి.. గంపగుత్తగా మీకే వేస్తాం.. అందుకు ప్రతిగా తులం బంగారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో అవాక్కైన సదరు అభ్యర్థి ఏం మాట్లాడాలో తెలియక నమస్కారం పెట్టి సైలెంట్‌గా వెనుదిరిగాడు. ఓటర్లు తమకు కావాల్సిన సౌకర్యాల కోసం కాకుండా.. డబ్బులు, బంగారం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
