- నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు.. మాకు కాదు
- సన్నాసి, దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడు : సీఎం రేవంత్
- తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకరే జాతిపిత
- జర్నలిస్టులు, సినిమా తారలు, జడ్జీలు.. అందరి ఫోన్లు విన్నరు
- మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ మొఖాలకు ముసుగు తొడిగి విచారణకు తీసుకురావాల్సింది
- కాంగ్రెస్ వచ్చాక తెలంగాణలో మున్సిపాలిటీల్లో 17,472 కోట్లతో అభివృద్ధి పనులు
నల్గొండ, వెలుగు:‘మనిషి అన్నోడు, అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెండ్లాల మాటలు వింటాడా? పెళ్లాం మొగుళ్ల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లా అయితడు..’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దోచుకొని ఆస్తులు సంపాదించుకున్నారని, అంతటితో ఆగకుండా ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టులు, సినిమా తారల ఫోన్లు సైతం విన్నారని మండిపడ్డారు.
‘ ఎవరు ఫోన్లలో మాట్లాడుకుంటుంటే ఈయనకు ఎందుకు, మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? ఇలా ఫోన్ వినేటోడు అసలు మనిషేనా’ అంటూ నిలదీశారు. ‘ఇలాంటి సన్నాసులకు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరు జాతిపిత? మీ జాతి ఏంటి? నీతి ఏంటి?’ అంటూ నిప్పులు చెరిగారు.
దోపిడీ చేసిన దొంగలు జాతిపిత ఎలా అవుతారని, వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్న మీలాంటోళ్లని జాతిపిత అంటే ఆత్మహత్య చేసుకుని చావాలన్నారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసినోళ్లు జాతిపిత అవుతారని, లుచ్చా, సన్నాసి , దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడని సీఎం స్పష్టం చేశారు. ‘హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కృష్ణారావు వంటి నేతలకు ఆయన జాతిపిత కావచ్చు .. కానీ ప్రజలకు కాదు.. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు కానీ.. కేసీఆర్ ఎప్పటికీ జాతిపిత కాలేరు..’ అన్నారు. ఏపీలో పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాష్ట్రం ఏర్పాటుచేసిన సోనియా గాంధీ మాత్రమే తెలంగాణ తల్లి అవుతుందన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ గూడూరు వద్ద రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘జాతిపిత అంటున్నోళ్లు పదేండ్లలో కొల్లగొట్టిన వేల కోట్లు, కూడబెట్టిన ఆస్తులు, కట్టిన ఫాంహౌస్‌లు, పెట్టిన టీవీలు, పేపర్లు.. తెలంగాణ ప్రజలకు ఇస్తరా? నిరుద్యోగులకు ఏమైనా ఇస్తారా? శ్రీకాంతా చారి ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మకు ఏ పదవి ఇవ్వలేదు.. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియదు.. వాళ్ల ఇంట్లోవాళ్లకు మాత్రం సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ పదవులు తీసుకున్నారు’ అని మండిపడ్డారు. నేరాలు, ఘోరాలు చేసినవాళ్లను పోలీసులు ముసుగు వేసి పట్టుకుని వస్తారని, కేటీఆర్, హరీశ్ రావులకు కూడా అలా ముసుగు వేసి పట్టుకుని రావాల్సిందన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్నాయకులు చేసిన తప్పులు ఒప్పుకుని ప్రజలను క్షమించమంటూ ముక్కు నేలకు రాయాలన్నారు.
మున్సిపల్ ఎన్నికల ముగిశాక రైతు భరోసా
మున్సిపల్ ఎన్నికలు ముగిశాక రైతుల ఖాతాల్లో క రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు జమ చేశామని, రైతు సంక్షేమం కోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు . గతంలో వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నారని, కానీ తాము అధికారంలోకి వచ్చాక క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరి ఉత్పత్తిలో మిర్యాలగూడ ఆసియాలోనే ముందుందని తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలు 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం, ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండ మీద విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్లకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గంగిరెద్దు లాగా ఊపుకుంటూ ఓటు కోసం వస్తే కర్రు కాల్చి వీపులో వాత పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ వాళ్ల దగ్గర మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నదని, ఏమైనా ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకే వేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు గంజికి గతి లేనోళ్లు వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నారని, పెద్ద పెద్ద బెంజ్ కార్లు కొన్నారని, ఆ సొమ్మంతా మందిని ముంచి సంపాదించేనని విమర్శించారు.
8 మంది ప్రాణాలు పోతే..మామ అల్లుడు దావత్ చేసుకున్నరు
గత ప్రభుత్వం నల్గొండ జిల్లాపై కోపంతో ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తిగా పక్కన పెట్టిందని, నల్గొండ ప్రజలు విషపు నీరు తాగడానికి బీఆర్ఎస్ కారణమని సీఎం ధ్వజమెత్తారు. రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేపట్టామని. అదే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందన్నారు. టన్నెల్లో 8 మంది చనిపోతే ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆగాయని దీంతో మామఅల్లుళ్లు దావత్‌లు చేసుకున్నారని ఆరోపించారు. ఏటా 2 లక్షల చొప్పున 20 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టే అవకాశం ఉన్నా ఒక్క ఇల్లు కట్టని కేసీఆర్, వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడని, పంజాగుట్ట చౌరస్తాలో 10 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో గడి నిర్మించుకున్నాడని సీఎం రేవంత్ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు పేదోళ్లకే ఇచ్చామని చెప్పారు. ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా నియోజక వర్గానికి 3, 4 వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే చాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నారని, ఏప్రిల్లో కొత్త బడ్జెట్లో లక్షలాది ఇల్లు ఇచ్చి పేదల ఆత్మగౌరవం కాపాడుతామన్నారు. మున్సిపాలిటీల్లో 17,472 కోట్లతో అభివృద్ధి పనులుచేపట్టామని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
మరో 8 ఏండ్లుఅధికారంలో ఉంటం
మహిళా శక్తి ఎదుట ఎవరూ నిలువలేరని ఉచిత బస్సుల్లో ప్రయాణించిన ఆడ బిడ్డలంతా కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. గతంలో ఒక్క కొత్త రేషన్‌కార్డయినా ఇవ్వలే దని, తమ ప్రభుత్వం లక్షలాది మందికి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. 3.15 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని, 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నా మని వివరించారు. తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయ్యిందని, మరో 8 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాల గూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంపీ రఘు వీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్ ,వేముల వీరేశం, పద్మావతి రెడ్డి, వంశీ కృష్ణ, కుందూ రు జైవీర్ రెడ్డి, మందుల సామెల్, పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
