మేడారంలో ఘనంగా తిరుగువారం... భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

మేడారంలో ఘనంగా తిరుగువారం... భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

తాడ్వాయి, వెలుగు : మేడారం మహాజాతరలో కీలకమైన తిరుగువారం పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలో సమ్మక్క పూజారులు, కన్నెపల్లిలో సారలమ్మ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు కుటుంబసమేతంగా వచ్చి తల్లుల గద్దెలను, గుడి పరిసరాలను పసుపు నీళ్లు, ఆవు పేడతో శుద్ధి చేశారు. అనంతరం యాటను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. 

తిరుగువారంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగిసిందని పూజారుల సంఘం సభ్యులు ప్రకటించారు. తిరుగువారం సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్‌‌‌‌‌‌‌‌, ఎస్పీ సుధీర్‌‌‌‌‌‌‌‌రాంనాథ్‌‌‌‌‌‌‌‌ కేకన్‌‌‌‌‌‌‌‌ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం అమ్మవార్లను సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని మంత్రి తెలిపారు. 

అనంతరం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులు నిరంతరం చేపట్టాలని, స్వచ్ఛ మేడారాన్ని అందించేలా చూడాలని ఆదేశించారు. వారి వెంట జిల్లా పంచాయతీ అధికారి, డీఎస్పీ ఉన్నారు. మరో వైపు పూనుగొండ్లలో పగిడిద్దరాజు జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.