- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదని, అన్ని స్థానాల్లో గెలిచి యాదగిరిగుట్ట మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మంగళవారం ఆయన పార్టీ బీఫామ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని అన్నారు.
ఎన్నికల్లో పోటీలో లేకుంటే ఇజ్జత్ పోతుందని నయానా, బయానా బతిమిలాడి నామమాత్రంగా వార్డుల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టారని ఎద్దేవా చేశారు. అయినా కూడా బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థులు సరిపోకపోవడంతో.. కొన్ని వార్డుల్లో పరస్పర ఒప్పందంతో అభ్యర్థులను నిలిపారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బాణీ భరత్ గౌడ్, అరుణ, మధు, రమ్య, స్వప్న ఆంజనేయులు, సరోజ, ప్రియదర్శిని, లావణ్య, వెంకటేష్, ధనలక్ష్మీ, మల్లేష్ యాదవ్, శ్రీధర్ తదితరులు ఉన్నారు.
