మనిషి అన్నోడు.. అన్నం తినేటోడు ఎవడైనా మొగుడు పెండ్లాం మాటలు వింటాడా.. ఆలు మొగల మాటలు విన్నోడి బతుకు చెడ అంటూ దుమ్మెత్తిపోశారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యనటలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం.. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదేండ్లలో వందల కోట్లు దోచుకున్నారు.. పెండ్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నారు.. అలాంటోడు జాతిపితనా..? ఎవరికి జాతిపిత..? అంటూ ప్రశ్నించారు. మిర్యాల గూడ ప్రాంతంలో భాస్కర్ రావు కూడా అలాంటోడేనని అన్నారు. భాస్కర్ రావు జాగ్రత్త.. వీపు చింతపండు మోత మోగుతది.. అంటూ హెచ్చరించారు.
పెండ్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నారని.. ఇలాంటోళ్లకు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. నీకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లా.. అట్లైతే నీ ఆస్తులు తెలంగాణ ప్రజలకు రాసివ్వు.. అంటూ డిమాండ్ చేశారు.
ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి గత పాలకులు పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. తెలంగాణ జాతి కోసం సర్వం కోల్పోయిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తెలంగాణ దేవత అని కొనియాడారు. కానీ కేసీఆర్ జాతిపిత ఎట్లైతడు..సిగ్గుండాలి అంటూ విమర్శలకు దిగారు.
