- గ్రేటర్ పరిధిలో 500 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ
- వీవీసీ మోటార్స్‌తో విమెన్ సేఫ్టీ వింగ్ ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళల ఆర్థిక సాధికారత, రవాణా రంగంలో వారి భాగస్వామ్యాన్ని పెంచే దిశగా తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. మహిళలను ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దడంతో పాటు వారికి ఎలక్ట్రిక్ ఆటోలను అందించనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వెహికిల్స్ డీలర్ షిప్ సంస్థ ‘వీవీసీ మోటార్స్’తో బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.
ఇందుకు సంబంధించి రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ చారుసిన్హా నేతృత్వంలో వీవీసీ మెటార్స్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూ ద్వారా మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సంస్థకు చెందిన అఫీషియల్ పార్ట్‌నర్ వీవీసీ మోటార్స్ సహకారంతో నగరంలో ‘మహిళా ఆధారిత ఎలక్ట్రిక్ మొబిలిటీ’ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.
500 మంది మహిళలను ఎంపిక చేసి..
మహిళలను ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు 500 మంది మహిళలను ఎంపిక చేయనున్నారు. వీరికి ఏడాది పాటు స్వయం ఉపాధి లభించడమే కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఉనికి పెరగడం వల్ల మహిళలకు మరింత సురక్షితమైన ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని అడిషనల్ డీజీపీ చారుసిన్హా వెల్లడించారు. ఈ ఒప్పందంలో క్షేత్రస్థాయిలో మహిళా డ్రైవర్లను సమీకరించడంతో పాటు ఎంపికైన మహిళలకు వీవీసీ మోటార్స్ సంస్థ వాహనాలను అందించనున్నట్లు తెలిపారు.
