- రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
- ఫస్ట్ ఫేజ్‌లో పాపులేషన్, సెకండ్ ఫేజ్‌లో క్యాస్ట్ బేస్డ్ సర్వే
- విపక్షాల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రతిపక్షాల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. జనగణనలో కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. దేశవ్యాప్త జనగణనలో ఎస్సీ, ఎస్టీ కాలమ్ మాత్రమే చేర్చారని.. మరోసారి కులగణనను కేంద్రం విస్మరించిందని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో కేంద్రం కులగణన కూడా చేపడ తామని తెలిపింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఎంపీ రజతి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జనగణన రెండో దశలో కులాల లెక్కలు సేకరించనున్నట్టు ఆయన తెలిపారు.
‘‘రెండు దశల్లో జరిగే జనగణనకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశాం. మొదటి దశలో గృహాల వివరా లు, ఆస్తులు, సౌకర్యాలు తదితర వివరాలు సేకరిస్తం. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రతి వ్యక్తి సామాజిక, ఆర్థిక పరిస్థితులు సహా అన్ని వివరాలు సేకరిస్తం. ఇప్పటికే మొదటి దశకు సంబంధించి ప్రశ్నావళి విడుదల చేశాం. కులం, సహా ఇతర అన్ని వివరాలను రెండో దశలో సేకరిస్తం. రెండో దశ ప్రారంభానికి ముందే సామాజిక వర్గం(కులం) సహా వివరాల ప్రశ్నావళిని విడుదల చేస్తాం” అని వెల్లడించారు. కాగా, కులగణనకు సంబంధించి తమిళనాడుతో పాటు వివిధ సంస్థల నుంచి కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తులు అందాయన్నారు.
