ఈ మధ్య కాలంలో జరుగుతున్న జాతిపిత అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. వందల కోట్లు దోచుకున్నోళ్లు, పెండ్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నోళ్లు జాతిపిత్ ఎలా అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని అన్నారు. బుధవారం (ఫిబ్రవరి 04) నల్గొండ జిల్లా మిర్యాలగూడ పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఈ కామెంట్స్ చేశారు సీఎం.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి గత పాలకులు పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. తెలంగాణ జాతి కోసం సర్వం కోల్పోయిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా తెలంగాణ దేవత అని కొనియాడారు. కానీ కేసీఆర్ జాతిపిత ఎట్లైతడు.. సిగ్గుండాలి అంటూ విమర్శలకు దిగారు.
పెండ్లం మొగుడి మాటలు రహస్యంగా విన్నారని.. ఇలాంటోళ్లకు నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారని అన్నారు సీఎం రేవంత్. నీకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్లా..అట్లైతే నీ ఆస్తులు తెలంగాణ ప్రజలకు రాసివ్వు.. అంటూ డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన తర్వాత.. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేస్తాం అని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ రెండేళ్లలోనే రైతుల కోసం లక్షా 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారాయన. 25 లక్షల 30 వేల మంది రైతులకు.. 21 వేల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశామని.. అప్పల నుంచి రైతులను విముక్తి చేసినట్లు చెప్పుకొచ్చారాయన.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే.. రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారాయన. దీని కోసం 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని.. ఈ 9 వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో నేరుగా వేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. వరి పంట వేస్తే ఉరే అని కేసీఆర్ ఎక్కడ.. వరి పండిస్తే గిట్టుబాటు ధరతోపాటు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తూ.. 3 కోట్ల 15 లక్షల మందికి లబ్ధి చేకూర్చామని.. వరి పంట అంటే రైతులకు ఉరి కాదు.. పండుగగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
