హైదరాబాద్: ఎన్టీఆర్ జిల్లాపై మోంథా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులతో వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో రేపు(అక్టోబర్ 28, 2025) విజయవాడలో షాపులు మూసేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మెడికల్, పాలు, కూరగాయల షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు. 2025, అక్టోబర్ 28వ తేదీ అర్థరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది.
ఈ తుఫాన్ ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కారు మేఘాలు కమ్మేశాయి. మోంథా తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా తీవ్రంగానే ఉండనుంది.
►ALSO READ | మోంథా తుఫాన్ ఎఫెక్ట్: వందకు పైగా రైళ్లు రద్దు.. క్యాన్సిల్ అయిన ట్రైన్స్ లిస్ట్ ఇదే !
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అది సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పింది.
