మోంథా తుఫాన్ ఎఫెక్ట్: వందకు పైగా రైళ్లు రద్దు.. క్యాన్సిల్ అయిన ట్రైన్స్ లిస్ట్ ఇదే !

మోంథా తుఫాన్ ఎఫెక్ట్: వందకు పైగా రైళ్లు రద్దు.. క్యాన్సిల్ అయిన ట్రైన్స్ లిస్ట్ ఇదే !

హైదరాబాద్: మోంథా తుఫాన్ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 67 రైళ్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 43 రైళ్లు ఇప్పటివరకూ రద్దయ్యాయి. రద్దయిన రైళ్లలో విశాఖ-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-దిల్లీ ఏపీ సూపర్‌ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్, విశాఖ-సికింద్రాబాద్ గరీబ్ రథ్ వంటి ముఖ్యమైన రైళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇవే కాకుండా.. ప్యాసింజర్ రైళ్లను, కొన్ని మెము రైళ్లను కూడా రై‌‌ల్వే శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. అక్టోబర్ 25న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారింది.

వాతావరణ శాఖ ఈ తుఫానుకు 'మొంథా' తుపానుగా పేరు పెట్టింది. ఈ తుఫాను ఏపీ తీరం దిశగా దూసుకెళుతుండటంతో వాతావరణ శాఖ ఏపీలోని 26 జిల్లాల్లో 23 జిల్లాలకు తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణపై కూడా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం ఉదయం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అది సోమవారం తుపానుగా, మంగళవారం తీవ్ర తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పింది. ఆ రోజుకు గాను నాలుగు జిల్లాలకు రెడ్, ఆరు జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసింది.

జయశంకర్​భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్​జిల్లాలకు రెడ్​అలర్ట్ ఇవ్వగా.. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్​జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్​ఇచ్చింది. ఇక బుధవారానికి గాను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్​అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఆయా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 

గురువారానికి గాను ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్​సిటీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని.. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి.