లక్షల కోట్లు ఉన్నా ఎలాన్ మస్క్‌కి ఆనందం లేదా..డబ్బు పోస్ట్‌పై నెట్టింట తుఫాను

లక్షల కోట్లు ఉన్నా ఎలాన్ మస్క్‌కి ఆనందం లేదా..డబ్బు పోస్ట్‌పై  నెట్టింట తుఫాను

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ చేసిన ఒక చిన్న ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను తుఫానును సృష్టించింది. డబ్బుతో సంతోషాన్ని కొనలేం అని ఎవరు చెప్పారో కానీ, వారికి విషయం బాగా తెలుసు అంటూ శాడ్ ఎమోజీని జోడించి మస్క్ చేసిన ఎక్స్ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 841.1 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న వ్యక్తి నోట ఈ మాటలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మస్క్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన వేదాంత ధోరణిని సమర్థిస్తుంటే.. మెజారిటీ ప్రజలు మాత్రం వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మీరు చెప్పేది మాకు అర్థం కావాలంటే, ఒక మిలియన్ డాలర్లు మాకు పంపండి.. అప్పుడు ఆ బాధ ఏంటో మేము కూడా అనుభవిస్తాం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే డబ్బు కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటివి చెప్పడం చాలా ఈజీ అంటూ మధ్యతరగతి కష్టాలను గుర్తు చేస్తున్నారు.

ALSO READ : ముంబై ట్రాఫిక్ లో 15 గంటలు.. నడి రోడ్డుపై నుంచే ఛాపర్ బుక్ చేసుకుని వెళ్లిన బిజినెస్ మ్యాన్

డబ్బు ప్రాముఖ్యత గురించి ఒక నెటిజన్ చేసిన వ్యాఖ్య నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు పడకను కొంటుంది కానీ నిద్రను కాదు, ఆహారాన్ని ఇస్తుంది కానీ ఆకలిని కాదు అని సదరు వ్యక్తి పేర్కొన్నారు. అయితే పేదరికం ఇచ్చే ఒత్తిడి మనస్సును కలిచివేస్తుందని, మనుగడ కోసం పోరాడాల్సిన అవసరం లేనప్పుడే మనిషికి నిజమైన ప్రశాంతత లభిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మస్క్ సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచితే వారి జీవితాల్లో నిజమైన సంతోషం వస్తుందని మరికొందరు పోస్ట్ పెట్టడం గమనార్హం. 

ALSO READ : టెక్కీలకు కాగ్నిజెంట్‌ శుభవార్త.. ఉద్యోగులకు 100% బోనస్..

మస్క్ నికర విలువ పెరగడానికి ఆయన కంపెనీలైన స్పేస్ ఎక్స్ , ఎక్స్ ఏఐ విలీనం ప్రధాన కారణం. ఈ డీల్ తర్వాత ఆయన ఆస్తుల విలువ 800 బిలియన్ డాలర్ల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పటికీ, మస్క్ తన వ్యక్తిగత జీవితంలో.. పని ఒత్తిడిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. మొత్తానికి డబ్బు-సంతోషం మధ్య ఉన్న సంబంధంపై మస్క్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రపంచవ్యాప్త చర్చకు దారితీశాయి.