టెక్కీలకు కాగ్నిజెంట్‌ శుభవార్త.. ఉద్యోగులకు 100% బోనస్.. దూసుకుపోతున్న కంపెనీ గ్రోత్

టెక్కీలకు కాగ్నిజెంట్‌ శుభవార్త.. ఉద్యోగులకు 100% బోనస్.. దూసుకుపోతున్న కంపెనీ గ్రోత్

గడచిన కొన్ని త్రైమాసాలుగా ఐటీ రంగంలో లేఆఫ్స్, బోనస్‌ల తగ్గింపు వార్తల మధ్య టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు అదిరిపోయే తీపి కబురు తీసుకొస్తోంది. 2025 సంవత్సరానికి గాను తమ సిబ్బందికి ఏకంగా 100 శాతం బోనస్ చెల్లిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు ఉన్న సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించనుంది. వీరిలో అత్యధికులు భారత్‌లోనే పని చేస్తుండటంతో.. ఇక్కడి టెక్కీల్లో సంతోషం వ్యక్తమౌతోంది. కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే చేరుకోవడంతో ఈ భారీ బోనస్‌ను ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది. 

ALSO READ : గురువారం దిగొచ్చిన గోల్డ్.. వెండి కేజీకి రూ.20వేలు తగ్గింది..

కాగ్నిజెంట్ రూపొందించుకున్న విన్నర్స్ సర్కిల్ అనే ప్రతిష్టాత్మక మైలురాయిని ఈ ఏడాది అధిగమించింది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని 2027 నాటికి చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఉద్యోగుల కష్టం, క్రమశిక్షణతో కూడిన పనితీరు వల్ల రెండేళ్ల ముందే అంటే 2025లోనే దీనిని సాధించింది. ఈ విజయంపై కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ప్రశంసలు కురిపించారు. క్లయింట్ల పట్ల ఉద్యోగుల నిబద్ధత, ఆదాయ వృద్ధిలో చూపిన చొరవ వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు.

ALSO READ : జాబ్ పోయిందా..? పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఒకేసారి తీసుకోవచ్చో తెలుసా..?

ఆదాయ వృద్ధి పరంగా చూస్తే.. 2025 క్యాలెండర్ ఇయర్‌లో కాగ్నిజెంట్ 6.4 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఇది తోటి ఐటీ దిగ్గజాలైన యాక్సెంచర్ 6.25%, హెచ్‌సీఎల్ టెక్ 4.8%, ఇన్ఫోసిస్ 3.15%, టీసీఎస్ 0.78% వృద్ధి రేట్ల కంటే ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లుగా వృద్ధి రేటులో వెనుకబడిన కాగ్నిజెంట్, 2022లో 10వ స్థానం నుంచి 2025 నాటికి టాప్-4 పెర్ఫార్మర్ల జాబితాలోకి చేరి టాప్ టైర్ హోదాను సంపాదించుకుంది. ముఖ్యంగా కంపెనీ AI విభాగంలో చేస్తున్న బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ : అమెరికా నుంచి ఐఫోన్, ల్యాప్‌టాప్ తెస్తున్నారా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ.. కాగ్నిజెంట్ మాత్రం తన మార్జిన్లను కాపాడుకుంటూనే మెరుగైన ఫలితాలను రాబట్టింది. ఒకవైపు విప్రో వంటి కంపెనీలు ప్రతికూల వృద్ధిని నమోదు చేస్తున్న తరుణంలో.. కాగ్నిజెంట్ ఏకంగా 100 శాతం బోనస్ ప్రకటించడం ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఇండివిడ్యువల్ పేఅవుట్ మెథడ్ గురించి కంపెనీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ.. లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఈ నిర్ణయం ఊహించని సంతోషాన్ని తెచ్చిపెట్టింది.