బెంగళూరులో ఘోర ప్రమాదం.. క్వారీలో బండరాయి పడి 7 వలస కార్మికులు మృతి!

బెంగళూరులో ఘోర ప్రమాదం.. క్వారీలో బండరాయి పడి 7 వలస కార్మికులు మృతి!

బెంగళూరు సౌత్ జిల్లాలోని మడపట్టణం సమీపంలో ఓ రాతి క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ బండరాయి విరిగిపడటంతో ఏడుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కావేరి అనే కంపెనీకి చెందిన క్వారీలో ఉదయం 7.30 గంటల సమయంలో కార్మికులు పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది. మరణించిన వారందరు బీహార్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు.

అసలు ఏం జరిగిందంటే..
ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో సుమారు 15 నుంచి 20 మంది దాకా కార్మికులు పనిచేస్తున్నారు. అదే సమయంలో భూమికి దాదాపు 100 అడుగుల ఎత్తులో ఓ హిటాచీ (ఎర్త్‌మూవర్) మిషన్ సహాయంతో కొండపై భాగాన్ని చదును చేస్తున్నారు. అక్కడ కొత్త క్రషర్ మిషన్‌ను అమర్చడం కోసం ఈ పనులు జరుగుతున్నాయి. అయితే, కింద కార్మికులు పనిచేస్తున్నారనే విషయాన్ని హిటాచీ డ్రైవర్ గమనించలేకపోయినట్లు తెలుస్తోంది. మిషన్ కొండపైకి వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా ఓ భారీ బండరాయి విరిగి నేరుగా కింద ఉన్న కార్మికులపై పడింది. సమాచారం అందుకున్న తావరకెరె పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి..  
ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "మడపట్టణాలో క్రషర్ గోడ కూలి ఏడుగురు కార్మికులు చనిపోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. క్వారీలో పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా యజమానులదే. నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న క్వారీలపై ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది" అని హామీ ఇచ్చారు.

►ALSO READ | లోయలోకి తోసింది ఎవరు..? సియా లేక చేతన్ ! కేతన్ హత్య కేసులో లై డిటెక్టర్ టెస్టు

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా ? అక్కడ కనీస భద్రతా నిబంధనలు పాటించలేదా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.