India vs Sri Lanka Test Series: భారత క్రికెట్ జట్టు ఆగస్టు మాసంలో శ్రీలంకలో పర్యటించనుందని లంక క్రికెట్ బోర్డు (SLC) అధికారికంగా ప్రకటించింది. 2025–2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) గ్రౌండ్‌లో నిర్వహిస్తారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్.. శ్రీలంకకు ప్రతి మ్యాచ్ అత్యంత కీలకం:
గతంలో రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక ఆరో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడానికి శ్రీలంకకు కేవలం 5 నుంచి10 శాతం అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దాంతో హోమ్ గ్రౌండ్‌లో జరగబోయే ఈ సిరీస్‌లో లంక జట్టు ఏ చిన్న తప్పు చేసినా ఫైనల్ రేస్ నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి వస్తుంది.
గిల్ సేనకు కమ్‌బ్యాక్ ఛాన్స్.. స్పిన్ పిచ్‌లపై అసలైన పరీక్ష:
శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో 2–2 తేడాతో సిరీస్ డ్రా చేసుకోవడం, వెస్టిండీస్‌పై హోమ్ సిరీస్ గెలవడంతో గిల్ ఎరా బాగానే ప్రారంభమైంది. కానీ, గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలో క్లీన్ స్వీప్ ఓటమి భారత జట్టు అవకాశాలని దెబ్బతీసింది. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్ల వైఫల్యం, అలాగే మన స్పిన్ విభాగంలో పస తగ్గడం లాంటి లోపాలు ఆ సిరీస్‌లో స్పష్టంగా బయటపడ్డాయి. ఐపీఎల్ (IPL) లో ఉండే ఫ్లాట్ పిచ్‌లు, టెస్ట్ మ్యాచ్‌లకు ముందు తగినంత ప్రాక్టీస్ సమయం లేకపోవడమే ఇండియన్ బ్యాటర్లు స్పిన్‌కు ఇబ్బంది పడటానికి ప్రధాన కారణాలుగా మారుతుండగా, ఇప్పుడు శ్రీలంక పిచ్‌లపై లంక స్పిన్నర్లను తట్టుకుని నిలబడటం గిల్ సేనకు అతిపెద్ద సవాల్ కానుంది.
ALSO READ : క్రికెట్ గ్రౌండ్ నుంచి ఫుట్బాల్ స్టేడియంలోకి..
గౌతమ్ గంభీర్‌పై పెరుగుతున్న ఒత్తిడి:
మరోవైపు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా ఈ సిరీస్ తీవ్ర ఒత్తిడి పెంచనుంది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ట్రాన్సిషన్ (జట్టు మార్పు) అనే పదానికి దూరంగా ఉన్న గంభీర్, ఇప్పుడు మాత్రం దానికి అలవాటు పడినట్లు కనిపిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ప్లేయర్లు క్రమంగా జట్టుకు దూరం కావడం కచ్చితంగా జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, టీమిండియా చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడగా, అప్పుడు మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 3–0తో క్లీన్ స్వీప్ చేసింది.
