ముంబై ట్రాఫిక్ లో 15 గంటలు.. నడి రోడ్డుపై నుంచే ఛాపర్ బుక్ చేసుకుని వెళ్లిన బిజినెస్ మ్యాన్

ముంబై ట్రాఫిక్ లో 15 గంటలు.. నడి రోడ్డుపై నుంచే ఛాపర్ బుక్ చేసుకుని వెళ్లిన బిజినెస్ మ్యాన్

ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై తరచుగా చోటుచేసుకునే ట్రాఫిక్ జామ్‌లు సామాన్యులనే కాదు.. బడా పారిశ్రామికవేత్తలను కూడా బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ముంబై నుంచి పుణెకు వెళ్లే క్రమంలో ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 8 గంటల పాటు ట్రాఫిక్ గ్రిడ్‌లాక్‌లో చిక్కుకుపోయారు. ఎంతసేపటికీ వాహనాలు కదలకపోవడం, ముఖ్యమైన వ్యాపార సమావేశానికి హాజరుకావాల్సి ఉండటంతో ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లడం అసాధ్యమని భావించి.. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రైవేట్ హెలికాప్టర్‌ను రప్పించుకున్నారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఎక్స్‌ప్రెస్‌వేపై గ్యాస్ ట్యాంకర్ ప్రమాదం కారణంగా దాదాపు 36 గంటల పాటు ట్రాఫిక్ గ్రిడ్ లాక్ ఏర్పడటం ప్రత్యామ్నాయాల లేమిపై ఆందోళనలు పెంచేస్తోంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆ పారిశ్రామికవేత్త తన కారులోనే గంటల తరబడి వేచి చూసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. చివరికి సమీపంలోని ఒక హెలిప్యాడ్ దిగేందుకు వీలున్న చోటుకు చేరుకుని, అక్కడి నుంచి చాపర్ ద్వారా పుణెకు చేరుకున్నారు. దీంతో ప్రయాణ సమయం గంటల నుంచి కేవలం నిమిషాలకు తగ్గిపోయింది.

ఈ ఉదంతం ముంబై-పుణె మధ్య మౌలిక సదుపాయాల లేమిని, ట్రాఫిక్ నిర్వహణలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవైపు ప్రభుత్వం వేల కోట్లతో కొత్త రహదారులు నిర్మిస్తున్నామని చెబుతున్నా, అత్యవసర సమయాల్లో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నారు వ్యాపారవేత్త. డబ్బు ఉన్నవారు హెలికాప్టర్లు పిలిపించుకోగలరు కానీ.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాలు, మెరుగైన ట్రాఫిక్ క్లియరెన్స్ వ్యవస్థ లేకపోవటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రద్దీ హైవేపై అక్కడక్కడా హెలీప్యాడ్స్ అవసరమని, అత్యవసర సమయాల్లో ప్రజలను తరలించటానికి అవి ఉపయోగపడతాయని బిజినెస్ మెన్ అన్నారు. కోట్లతో కట్టిన మార్గాలకు లక్షలు వెచ్చించి సౌకర్యాలు ఇవ్వలేకపోవటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ 'చాపర్ జర్నీ' స్టోరీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.