టిఫిన్ తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేస్తోందా ? అసలు కారణాలు ఇవే!

టిఫిన్ తిన్న గంటకే మళ్ళీ ఆకలి వేస్తోందా ? అసలు కారణాలు ఇవే!

మనం కడుపు నిండా టిఫిన్ తిని ఆఫీసు పనిలోనో లేదా ఇంట్లో పనిలోనో పడతాము... కానీ గంటసేపు  కాకముందే కడుపులో మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ప్రముఖ డైటీషియన్ ప్రకారం.. ఇలా అనిపించడానికి  మీరు ఎంత తిన్నారు అని కాదు, మీరు తిన్న ఆహార పదార్థాల వల్ల జరుగుతుంది. దీనికి అసలు కారణాలు ఏంటో తెలుసా... 

1. పిండి పదార్థాలు 
మనం తినే బ్రెడ్, పంచదార కలిపిన పదార్థాలు లేదా పాలిష్ చేసిన బియ్యంతో చేసిన టిఫిన్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచి, అంతే వేగంగా తగ్గించేస్తాయి. అయితే షుగర్ లెవల్స్ పడిపోగానే, మన మెదడు మళ్ళీ ఆకలి వేస్తున్నట్లు సంకేతాలు పంపిస్తుంది. దీనివల్ల తిన్న కొద్దిసేపటికే మళ్ళీ నీరసంగా, ఆకలిగా అనిపిస్తుంది.

2. ప్రోటీన్, మంచి కొవ్వులు  
తిన్న ఆహారం మెల్లిగా అరగాలంటే అందులో ప్రోటీన్, మంచి కొవ్వులు ఉండాలి. ఇందుకు కేవలం దోశ లేదా ఇడ్లీ మాత్రమే కాకుండా.. వాటితో పాటు గుడ్లు, పప్పులు, పెరుగు లేదా  బాదం, వాల్‌నట్స్ వంటివి చేర్చుకుంటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెల్లిగా చేసి కలిని కంట్రోల్ చేస్తాయి.

3. పీచు పదార్థం
పీచు పదార్థం ఆహారాన్ని కడుపులో ఎక్కువ సేపు ఉంచుతుంది. మీరు తినే టిఫిన్‌లో ఫైబర్ తక్కువగా ఉంటే, కడుపు త్వరగా ఖాళీ అయిపోతుంది. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పు గింజలను మీ అల్పాహారంలో భాగం చేసుకోండి.

4. నిద్రలేకపోవడం, ఒత్తిడి
శరీరానికి సరిపడా విశ్రాంతి/నిద్ర  లేకపోయినా, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఆకలి హార్మోన్లు తలకిందులవుతాయి. గ్రెలిన్ అనేది ఆకలిని పెంచే హార్మోన్. నిద్ర తక్కువైతే గ్రెలిన్ పెరుగుతుంది. లెప్టిన్ అనేది కడుపు నిండిందని చెప్పే హార్మోన్. నిద్ర తక్కువైతే లెప్టిన్ తగ్గిపోతుంది. శరీరం అలసిపోయినప్పుడు వెంటనే శక్తి కోసం ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది.
 
టిఫిన్ తిన్న గంటకే ఆకలి వేస్తుందంటే.. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ మరియు మంచి కొవ్వులు తక్కువగా ఉన్నాయని అర్థం. వీటిని పెంచుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండొచ్చు.