సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలి: టీటీడీ ఇంచార్జి ఈవో వెంకయ్య చౌదరి 

సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలి: టీటీడీ ఇంచార్జి ఈవో వెంకయ్య చౌదరి 

సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని.. శాస్త్రం, సంప్రదాయానికి సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను కాపాడాలని అన్నారు టీటీడీ ఇంచార్జి ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. బుధవారం ( ఫిబ్రవరి 4 ) తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అర్చక, పరిచారక, వేదపారాయణదారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు వెంకయ్య చౌదరి. 

టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాలలో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు మరియు 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగా, నియమబద్ధంగా నిర్వహించేందుకు ఈ పునఃశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని... మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ఇవి దోహదపడతాయని అన్నారు. శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వంటి మహనీయులు కాపాడుతూ వచ్చిన సనాతన సంప్రదాయాన్ని భక్తులకు, సమాజానికి చేరవేయడంలో ఈ శిక్షణా తరగతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు వెంకయ్య చౌదరి.

ఈ తరగతులలో ఆగమ పరిచయం, ఆగమాలు, వైఖాసనం, నిత్య పూజ విధానం, పంచసూక్తాలు, సంధ్యావందనం, గోత్రప్రవరలు, అగ్ని ప్రతిష్టాపన, నవ్యశేషాంశములు, అష్టోత్తర, ఆశీర్వచన మంత్రాలు, ఉచ్ఛరణ సంస్కృత పరిజ్ఞానం, కల్యాణోత్సవంలో లాజహోమ ప్రధాన హోమాలు, తిరుమల శ్రీవారి ఆలయ ఉత్సవాలు, సంప్రదాయాలు, బ్రహ్మోత్సవం, అర్చకుల లక్షణాలు, విధులు, పవిత్రోత్సవం ప్రాముఖ్యత, గృహ అర్చన, బింబ ప్రతిష్ట, వైశిష్ట్యం, జ్యోతిష్య శాస్త్రం, నిత్యార్చన, శిక్షణ నిర్ధారణ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ అనంతరం శిక్షణ తీసుకున్న వారు ఏమి నేర్చుకున్నారు, ఇంకా ఏమి నేర్చుకోవాలో తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ సేకరించి తదనుగుణంగా మాడ్యూల్స్  రూపొందించాలని సూచించారు.

అనంతరం వేద విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, అర్చకులు, పరిచారకులు, వేద పండితులకు శిక్షణా కార్యక్రమాలు తప్పనిసరిగా నిరంతరం నిర్వహించాలన్నారు. ఈ శిక్షణల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభించడమే కాకుండా, భిన్నమైన అభిప్రాయాల పరస్పర మార్పిడి ద్వారా నూతన ఆలోచనలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

అనంతరం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్త బ్రహ్మోత్సవానుక్రమణికా పుస్తకాన్ని ఆవిష్కరించారు టిటిడి ఇంఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి . అనంతరం మానవ నిత్య జీవితంలో వేదాల విశిష్టతను, యోగా ప్రాముఖ్యత తెల్పేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు. తిరుమల ఆలయ తరహాలో టిటిడిలోని అన్ని ఆలయాలలో కైంకర్యాలు నిర్వహించేందుకు వీలుగా టిటిడి ఆధ్వర్యంలోని 61 ఆలయాలలో పనిచేసే అర్చక,  పరిచారిక, వేదపారాయణందారులకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది.