తిరుమలలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. ఏఐ సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు

తిరుమలలో భక్తుల భద్రతపై టీటీడీ ఫోకస్.. ఏఐ సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు

తిరుమలలో భక్తుల భద్రతపై ఫోకస్ పెట్టింది టీటీడీ. ఈ క్రమంలో అధునాతన FRC ఏఐ ఆదారిత ఫెస్ రికగ్నేషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కెమెరాలు, భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, వాహన సేవలు, దర్శనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాయని తెలిపింది టీటీడీ. 

పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టు మెరుగైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని... ఆదునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు టీటీడీ అధికారులు.

తిరుమల కొండపై హిందు పవిత్రతను దెబ్బ తీయాలని సంఘవ్యతిరేఖ శక్తులు దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్న క్రమంలో తిరుమల కొండపై భద్రత పట్ల స్పెషల్ ఫోకస్ పెట్టింది టీటీడీ. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన అధునాతన FRC ఏఐ కెమెరాలు పాత నేరస్తుల కదలికలను ఇట్టే పట్టేస్తాయని తెలిపారు అధికారులు. 

ఎక్కడెక్కడో నేరాలకు పాల్పడినవారు తిరుమలలో తలదాచుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెడ్ సాండిల్ స్మగ్లర్లు తిరుమలలో పట్డుబడిన సందర్బాలు ఉన్నాయి.  ఇళ్ళ నుండి పారిపోయి తిరుమలకు వచ్చే సంఘటనలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చి తప్పిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తోటి భక్తులతో కలిసిపోయి చైన్ స్నాచింగ్ చేస్తుంటారు. చిన్న పిల్లల కిడ్నాప్ లు అప్పుడప్పుడు కలకలం రేపుతుంటాయి. ఏఐ కెమెరాలతో ఈ సమస్యలన్నిటికీ చెక్ చెప్పచ్చని అంటున్నారు అధికారులు.
 
జనవరి నెలలో రథసప్తమి రోజున ఈ అధునాతన కెమెరాలను తిరుమలలోని మాడవీధుల్లో ఏర్పాటు చేశామని... ఈ ఏఐ ఆధారిత కెమెరాల సాయంతో  భక్తుల రద్దీ ఎలా ఉందని అంచనా వేయొచ్చని.. అలాగే వాహన సేవల్ని ఎంత మంది భక్తులు దర్శించుకున్నారనే దానిపై కూడా పక్కాగా సమాచారం సేకరించినట్లు చెబుతున్నారు టీటీడీ అధికారులు.

తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కెమెరాలను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు కనెక్ట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుందని.. తిరుమలలోని ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు తర్వాత.. డిసెంబర్, జనవరిలో వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు అధికారులు. 

కమాండ్ కంట్రోల్ సెంటర్ సాయంతో భక్తుల రద్దీని అంచనా వేసి.. దర్శనాలు వేగంగా జరిగేలా చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు. 24/7 మానిటరింగ్ చేస్తూ గుర్తించిన సమాచారాన్ని క్షణాల్లో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అందజేస్తున్నాయని... ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు.  భవిష్యత్తులో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మరింత మెరుగైన భద్రతా చర్యలు తీసుకునేందుకు ఈ అధునాతన సిసి కెమెరాలు ఉపయోగపడనున్నాయని తెలిపారు అధికారులు.