రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు.. శామీర్ పేటలోని ఏడీ శంకర్ నివాసంలో తనిఖీలు

రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు.. శామీర్ పేటలోని ఏడీ శంకర్ నివాసంలో తనిఖీలు
  •     మంచిర్యాల హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో లాకర్లు ఓపెన్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ శంకర్ నివాసంలో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి.  మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు మంచిర్యాలలోని ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు మరోవైపు కలెక్టరేట్​లోని ఆఫీసులో వెటర్నరీ డాక్టర్లను ఎంక్వయిరీ చేశారు. బుధవారం హైదరాబాద్ శివారు శామీర్ పేటలోని శంకర్ నివాసంలో ఏసీబీ అధికారుల బృందం సోదాలు చేపట్టిందని డీఎస్పీ మధు తెలిపారు. మరోవైపు మంచిర్యాలలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులోని లాకర్లను తెరిపించి చెక్ చేసినట్టు సమాచారం.

మంగళవారం జరిపిన సోదాల్లో శంకర్ ఇంట్లో 42 ఖరీదైన మద్యం బాటిళ్లు లభించగా ఎంక్వయిరీ కోసం ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అంతేకాకుండా భారీగా బంగారం, స్థిరాస్తుల డాక్యుమెంట్లు లభించినట్టు సమాచారం. ఏడీ శంకర్ అవినీతికి సంబంధించిన పలు ఆధారాలను డాక్టర్ల దగ్గర నుంచి సేకరించినట్టు తెలిసింది. సోదాలు పూర్తయిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రెండు రోజులుగా తనిఖీలు కొనసాగుతుండడంతో పశుసంవర్ధక శాఖలో కలకలం రేగింది.