కొట్టాయం (కేరళ): పాలా మున్సిపాలిటీ చైర్‌పర్సన్ దియా బినుపై ఎల్‌డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గుర్తింపు పొందిన దియా బిను పదవి కోల్పోయారు. ఈ పరిణామంతో పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్ అధికారానికి తెరపడింది. మున్సిపాలిటీలో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు.
దీంతో తీర్మానానికి 17 ఓట్లు రావడంతో యూడీఎఫ్ పాలన కూలిపోయింది. అయితే తమకు పార్టీ విప్ అందలేదని, స్థానిక కాంగ్రెస్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్నే పాటించామని తిరుగుబాటు కౌన్సిలర్లు చెప్పారు. తన తొలగింపుపై దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన తీర్పును గౌరవంగా స్వీకరిస్తున్నానని తెలిపారు. తనపై ఎలాంటి అవినీతి లేదా చట్టవిరుద్ధ ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. చైర్‌పర్సన్‌గా తీసుకున్న ప్రతి నిర్ణయం పారదర్శకంగానే తీసుకున్నానని చెప్పారు.
