ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో గధేగల్లు స్తంభం.. 11వ శతాబ్దానికి చెందిన అరుదైన స్థంభం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లో గధేగల్లు స్తంభం.. 11వ శతాబ్దానికి చెందిన అరుదైన స్థంభం

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలకేంద్రంలో 11వ శతాబ్దానికి చెందిన అరుదైన గధేగల్లు స్తంభాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రొడ్డావార్ పృథ్వీరాజ్, సాయిరాజ్ కాంబ్లే తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల్లో అప్పటి పాలకులు దానశాసనాల గుర్తుగా ఇటువంటి స్తంభాలను ఏర్పాటు చేసేవారని వివరించారు. ఈ స్తంభాలు మూడు భాగాలుగా ఉంటాయన్నారు.

మొదటి భాగంలో సూర్యుడు, చంద్రుడు, కలశం, శివలింగం వంటి చిహ్నాలు, రెండో భాగంలో శాసనం చెక్కి ఉంటుందని తెలిపారు. దానశాసనాలను ఉల్లంఘించిన వారికి పాపం సంభవిస్తుందని హెచ్చరించే శాపోక్తులు, వాటికి సంబంధించిన శిక్షల వివరాలు శిలాఫలకాలపై చెక్కి ఉండటం వీటి ప్రత్యేకత అని పేర్కొన్నారు. జైనథ్‌‌లో గుర్తించిన గధేగల్లుపై శాసనం లేకపోయినా గణపతి, పైభాగంలో శివలింగం చెక్కి ఉండటం ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదని, ఇది అరుదైన లక్షణమని చెప్పారు.