న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తీరంలో ప్రయాణిస్తున్న నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయ నావికులు మరణించడంపై కేంద్రప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రష్యా తాత్కాలిక రాయబారి వ్లాదిమిర్ లాడనోవ్‌కు భారత విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది.
వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం దారుణమని, ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని భారత్ కోరింది. భారతీయుల మృతికి కారణమైన ఈ దాడి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యా దౌత్యవేత్తకు స్పష్టం చేసింది. ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో నౌకల భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నామని పేర్కొంది.
