- జిల్లాలో నిషేధిత మందులు అమ్ముతున్న ముఠా
- సర్జరీ సమయంలో వినియోగించే మత్తు మందులు, ట్యాబ్లెట్ల విక్రయాలు
- గంజాయి వినియోగదారులకు అంటగడుతున్న వైనం
- అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొందరు ఆర్ఎంపీలు, ఫార్మాసిస్టులు
- మెడికల్ డ్రగ్స్ అధికారుల పర్యవేక్షణ శూన్యం
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మత్తు ఇంజక్షన్ల దందా జోరుగా సాగుతోంది. కొన్ని మెడికల్ ఏజెన్సీలు, షాపులు, కొంత మంది ఆర్ఎంపీలే ఇందులో సూత్రధారులు కావడం గమనార్హం. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేనిదే అమ్మకూడని ట్యాబ్లెట్లు, నిషేధిత మత్తు మందులు యథేచ్చగా అమ్ముతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వైద్య అవసరాలకు కేవలం డాక్టర్లు మాత్రమే వినియోగించాల్సిన మత్తు ఇంజక్షన్ ధర రూ.390 ఉండగా దాన్ని బహిరంగ మార్కెట్లో రూ. 1500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో పోలీసుల తనిఖీల్లో మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అక్రమ డ్రగ్స్ లో మెడికల్ నిర్వహకులు, ఆర్ఎంపీలే ముఠాగా..
జిల్లాలో కొన్ని మెడికల్ షాపులు, ఫార్మసిస్టులు, కొందరు ఆర్ఎంపీలు అక్రమంగా కెమికల్స్, డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీరంత ఓ ముఠాగా ఏర్పడి నిషేధిత ట్యాబ్లెట్లు, మత్తు ఇంజక్షన్లు ప్రజలకు విక్రయిస్తున్నట్లు ఇటీవల పోలీసుల తనిఖీల్లో తేలింది. అవసరమున్నవారికి సాధారణ మందులతో పాటు నిషేధిత మత్తు మందులు, ట్యాబెట్లు విక్రయిస్తుండడంతో యువత వాటిని వినియోగిస్తూ మత్తులో జోగుతున్నారు. ఏయే మందులు అమ్మారనే రికార్డులు కూడా కొన్ని మెడికల్ షాపులు మెయింటెయిన్ చేయడం లేదు. ఇటీవల పట్టణంలోని మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో మెడికల్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. 12 మెడికల్, ఏజెన్సీ షాపులకు నోటీసులు జారీ చేశారు.
ఇటీవల పోలీసుల తనిఖీల్లో నమోదైన కేసులు
- ఈ నెల 12న రాత్రి ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా స్కూటీపై సంచరిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. విచారించగా అతడిని ఆర్ఎంపీ సిందే జగన్నాథ్‌గా గుర్తించారు. సర్జరీల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ‘టర్మిన్’ అనే మత్తు మందును మెడికల్ ఏజెన్సీ, మెడికల్ షాపు నిర్వాహకుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, గంజాయి వినియోగదారులు, ఇతర వ్యక్తులకు అధిక ధరలకు అమ్మతున్నట్లు గుర్తించారు. 190 ఇన్సులిన్ సింరజీలు, 50 టర్మిన్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.
- ఈ నెల 16న సాయంత్రం ఉట్నూర్ పట్టణంలోని ఈద్గా కేబీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో కొందరు మత్తు కోసం నిషేధిత నొప్పి నివారణ ‘టాపెంటాడాల్’ గోలీలను పిండి చేసి సిరంజీల ద్వారా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో చౌహాన్ నిఖిల్ రాజ్, పొడేటి వంశీకృష్ణ, ఫార్మసిస్ట్ కదం శేఖర్‌ను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
