కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదు : కేటీఆర్

కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్ఏ చెప్పలేదు : కేటీఆర్

 

  • రోజుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసే చాన్స్ ఉన్నా చేయట్లే: కేటీఆర్
  • మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బీఆర్ఎస్ రైతు సదస్సు

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొద్దని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదని, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నప్పటికీ సీఎం రేవంత్​రెడ్డి  సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసే చాన్స్ ఉన్నా కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పేరొస్తుందన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు నడపడం లేదని విమర్శించారు.

మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సులో పాల్గొన్నారు. అనంతరం మే 5న ఈదురుగాలుల బీభత్సానికి లక్సెట్టిపేట మండలం గంపలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో గోడలు కూలి చనిపోయిన నలుగురు రైతుల కుటుంబాలకు పార్టీ తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. ఈ  ఘటన జరిగి రెండున్నర నెలలు గడిచినా ఒక్కరికి మాత్రమే రైతుబీమా నుంచి రూ.5 లక్షలు ఇచ్చారని,  మిగతా ముగ్గురికి ఎలాంటి సాయం అందలేదని అన్నారు. 

ఎవర్నీ వదలిపెట్టం 

రేవంత్​రెడ్డి మాట్లాడినప్పుడల్లా ‘నీది ఏ జాతి’ అని అడుగుతున్నాడని, ఎవరిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు తెలుసని కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగుమని, రైతులు సాగునీళ్లు అడిగితే రక్తం చల్లుకోమంటున్న రేవంత్​ వంటి రాక్షస జాతి తమది కాదన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ లీడర్లను సతాయించే ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు. ఇప్పుడు అతి చేస్తున్న పోలీసులకు మిత్తీతో సహా తిరిగిస్తామని, రిటైరైనా గుంజుకొచ్చి ప్రజల ముంగిట నిలబెడుతామన్నారు. సదస్సులో ప్రశాంత్​రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, జీవన్​రెడ్డి, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.