- ఎన్నికల పరిశీలకుడు హనుమంత్
ఆదిలాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమావళి, వ్యయ నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులకు బుధవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్గొన్న హనుమంత్‌నాయక్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పరిమితి రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని, అభ్యర్థులు తమ ఖర్చుల వివరాలను నిర్ణీత ఫారమ్ 1, 2, 3, 4లలో పొందుపరచాలని సూచించారు.
అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను ఈ నెల 6వ, 9వ తేదీల్లో మున్సిపల్ కార్యాలయంలో ఆడిటర్లకు చూపించి, సందేహాలను నివృత్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. అవగాహన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్, వ్యయ పరిశీలకులు విజయ, నోడల్ అధికారులు మనోహర్, సునీత, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలి
లక్సెట్టిపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తప్పకుండా నిబంధనలు పాటించాలని లక్సెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎన్నికల స్పెషల్ అధికారి దిలీప్ కుమార్ సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు బుధవారం స్థానిక పాత ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొని ఎన్నికల నిబంధనలు , ఎన్నికల కోడ్‌పై అవగాహన కల్పించారు. ఎస్సై గోపతి సురేశ్, మున్సిపల్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
