ప్రభుత్వ ఆస్పత్రు లను గాడిలో పెట్టేందుకు యాక్షన్ ప్లాన్‌‌ : వైద్య ఆరోగ్య శాఖ

ప్రభుత్వ ఆస్పత్రు లను గాడిలో పెట్టేందుకు యాక్షన్ ప్లాన్‌‌ : వైద్య ఆరోగ్య శాఖ
  •     నేటి నుంచి జిల్లాల బాట పట్టనున్న డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్‌‌కు వచ్చే పేషెంట్ల ఇబ్బందులను తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ బరిలోకి దిగింది. ఇందుకోసం రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని మూడు ప్రధాన డిపార్ట్‌‌మెంట్ల హెచ్ఓడీలు గురువారం నుంచి జిల్లాల బాట పట్టనున్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ (డీహెచ్), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 

విడతల వారీగా జిల్లాలకు వెళ్లి అక్కడ గ్రౌండ్ లెవల్ మీటింగ్స్ పెట్టనున్నారు. ఈ మేరకు పీహెచ్‌‌సీ మెడికల్ ఆఫీసర్ల నుంచి సూపరింటెండెంట్లు, రేడియాలజిస్టులు, నర్సింగ్ డిపార్ట్‌‌మెంట్ల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా రిఫరల్ సిస్టమ్‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. 

సీహెచ్‌‌సీ, జిల్లా హాస్పిటల్స్ పరిష్కారమయ్యే చిన్న కేసులనూ నేరుగా గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటల్స్‌‌కు రాసి పంపుతున్నారు. ఫలితంగా ఆయా హాస్పిటల్స్‌‌పై తీవ్ర భారం పడుతోంది. ఈ విధానాన్ని సరిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. అక్కడ వచ్చే ఫలితాలను పరిగణనలోకి తీసుకొని, మిగతా జిల్లాల్లోనూ ఈ పద్ధతిని అమలు చేయనున్నారు.