- రూ.1.65 కోట్ల అవకతవకలు
- 11 మంది అధికారులపై వేటు
దహెగాం, వెలుగు: దహెగాం మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో టీఏ, పంచాయతీ అధికారులు సహా ఏకంగా 11 మందిపై డీఆర్డీవో వేటు వేశారు. 2024–25 సంవత్సరానికి గాను దహెగాం మండలంలో జరిగిన రూ.7.96 కోట్ల ఉపాధి హామీ పథకంపనులకు సంబంధించి బుధవారం ప్రజావేదికలో సోషల్ఆడిట్ నిర్వహించారు. డీఆర్డీవో దత్తారాం హాజరయ్యారు. అధికారులతో కలిసి సోషల్ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ అక్రమాలు జరిగినట్లు తేలింది. రూ.1.65 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు.
దీంతో అవకతవకలకు పాల్పడ్డ దహెగాం, కమ్మర్పల్లి టీఏ రాజేశ్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. కొంచవెల్లి, చౌక గ్రామాలకు చెందిన నలుగురు మేట్లను విధులనుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇద్దరు పంచాయతీ సెక్రటరీలు, ఇద్దరు టెక్నికల్అసిస్టెంట్లు, ఇద్దరు ఫీల్డ్అసిస్టెంట్లకు షోకాజ్‌నోటీసులు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.
దుర్వినియోగమైన రూ.1.65 కోట్ల నిధులను రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంబుడ్స్ పర్సన్ సాయిశ్రీ, ఎస్టీఎం వేణు, ప్లాంటేషన్ మేనేజర్ఆంజనేయులు, క్యూసీ రమేశ్, ఎస్ఆర్పీ రవి, సూపరింటెండెంట్ నాగేశ్, ఏపీవో కల్పన, పంచాయతీ సెక్రటరీలు, టీఏలు, ఫీల్డ్అసిస్టెంట్లు పాల్గొన్నారు.
