స్కూల్లో టీచర్ల తర్వాత అంతటి బాధ్యతతో మెలగాల్సిన అటెండర్.. బాలికల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చిన ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో బాలికల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు బయటపడటం షాకింగ్ కు గురిచేసింది. సోమవారం (అక్టోబర్ 27) జరిగిన ఈ ఘటనతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు.
సోమవారం ఇంటర్వెల్ సమయంలో వాష్ రూమ్ లో అనుమానాస్పదంగా మెరుస్తున్న కెమెరాను గుర్తించారు విద్యార్థులు. వెంటనే కొంత మంది తమ తల్లిదండ్రులకు కెమెరా విషయం గురించి చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. మిమ్మల్ని నమ్మి పిల్లలను స్కూల్ కు పంపితే మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి.. అంటూ హెడ్ మాస్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
►ALSO READ | ఫేస్ బుక్ లో అమ్మాయి పేరుతో ఫ్రెండ్షిప్.. రూ. పది లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్..
ఈ వ్యవహారంపై తల్లిదండ్రులతో పాటు హెడ్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ కు చేరుకున్న పోలీసులు.. బాలికల వాష్ రూమ్ లో ఉన్న కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. బాలికల వాష్‌రూమ్‌లో అటెండర్ యాకూబ్ పాషా రహస్యంగా కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరించినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
