Washington Post on Adani: అదానీ చుట్టూ గడచిన కొన్ని ఏళ్లుగా వివాధాలు కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా మరో వివాదంలో అదానీ గ్రూప్ పేరు కొనసాగుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సేవల సంస్థగా ఉన్న ఎల్ఐసీ ప్రస్తుతం ఇందులో కేంద్ర బిందువుగా మారింది. లక్షల కోట్ల విలువ కలిగిన ఈ సంస్థ డబ్బుతో అదానీకి అండగా నిలబడాలని చూస్తున్నట్లు అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టులో వచ్చిన వార్తలు దుమారం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే కొన్నాళ్ల కిందట అమెరికాలోని యూఎస్ సెక్యూరిటీస్ అధికారులు అదానీ సంస్థలపై అవినీతి, మోసం ఆరోపణలు చేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ బ్యాంకులు, ఇతర సంస్థలు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. దీంతో అదానీ గ్రూప్ కొంత ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిందనే వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వ అధికారులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అదానీ వ్యాపారాలకు దాదాపు 3.9 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.33వేల కోట్ల పెట్టుబడులను మళ్లించడానికి మే నెలలో ఒక ప్రతిపాదనను రూపొందింరని వాషింగ్టన్ పోస్ట్ శుక్రవారం పేర్కొంది.
అయితే వాషింగ్టన్ పోస్టు కథనం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనదిగా బీమా సంస్థ ఎల్ఐసీ ఖండించింది. మరోపక్క దేశంలోని కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలు వాషింగ్టన్ నివేదికతో మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌లో దాదాపు 30 కోట్ల పైగా పాలసీదారులు ఉన్న ప్రభుత్వ రంగ దిగ్గజం LIC తన నిధులను అదానీ గ్రూప్ లోకి పెట్టుబడిగా మళ్లించాలని బీజేపీ సర్కార్ ప్రయత్నించటం ముమ్మారిటికీ తప్పేనని కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి అంశంపై పార్లమెంటరీ కమిటీ స్థాయిలో విచారణ డిమాండ్ పెరుగుతోంది. పాలసీదారులు, సామాన్యులు తమ పొదుపు భద్రతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదే సమయంలో అదానీ గ్రూప్ పెట్టుబడుల వల్ల ఎల్ఐసీకి దాదాపు రూ.12వేల కోట్ల వరకు నష్టం వచ్చింది అనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి బీమా సంస్థ నుంచి లేదు. దేశ ప్రజల పొదుపు నిధులను ప్రైవేట్ సంస్థకోసం రిస్క్‌లో పెట్టినట్టు ఆరోపణలు రాజకీయంగానే కాకుండా సామాన్యుల్లోనూ సంచలనంగా మారింది. అయితే ఎల్ఐసీ అదానీ గ్రూప్ కంపెనీల్లో కంటే ఇతర సంస్థల్లోనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టి వాటాలను కలిగి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. మోడీ తన మిత్రుడు అదానీకి అండగా నిలిచేందుకు ఈ ప్లాన్ రచించారంటూ.. దీనికి నీతి ఆయోగ్, ఆర్థిక శాఖ దానికి అనుగుణంగానే పెట్టుబడి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ అమెరికా నుంచి వచ్చిన ఆరోపణల తర్వాత దీనికి బ్రేక్ పడిందంటూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీనిపై పదేపదే స్పందన కోసం అభ్యర్థించామని కానీ ప్రధాని లేదా ఆర్థిక శాఖ నుంచి జవాబు రాలేదని కూడా తన కథనం పేర్కొంది.
