భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ కేవలం ఆర్థిక కోణంలోనే కాకుండా.. దౌత్యపరంగా ఒక సంచలనానికి తెరలేపింది. ఈ ఒప్పంద వివరాలను వెల్లడిస్తూ అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న విధానానికి భిన్నంగా.. ఈ పటంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(PoK), చైనా ఆధీనంలోని అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించడం పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా అమెరికా లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే మ్యాప్‌లలో జమ్మూ కాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖ(LoC)ను స్పష్టంగా చూపిస్తూ.. పీఓకేని వివాదాస్పద ప్రాంతమని పేర్కొంటాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మ్యాప్ లో ఎటువంటి విభజన రేఖలు లేకుండా మొత్తం కాశ్మీర్‌ను భారత్ భూభాగంగానే చూపించింది. ఇది పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. అంటే కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరితో అమెరికా ఏకీభవిస్తోందనే సంకేతాన్ని వాషింగ్టన్ ఓపెన్ గా ప్రకటించిందని వారు చెబుతున్నారు.
ఎందుకు ఈ మ్యాప్ అంత ముఖ్యం?
గతంలో అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేది. కానీ ఈసారి ట్రంప్ టీమ్ ఆ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ భారత మ్యాప్‌ను యథాతథంగా ఆమోదించింది. ఇదే క్రమంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా భారత్ మ్యాప్‌లోనే ఉంచడం ద్వారా.. సరిహద్దు వివాదాల్లో అమెరికా భారత్ వెంటే ఉందనే విషయాన్ని చైనాకు అర్థమయ్యేలా చెప్పింది. గత 6 నెలలుగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా చుట్టూ తిరుగుతూ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినా.. ఈ మ్యాప్ రూపంలో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. బిగ్ బాస్ ఇండియా వెనుక ఉన్నాడని తేలిపోయింది.
వాణిజ్యం ప్లస్ వ్యూహం.. అదే ట్రంప్ మార్క్
ఒకప్పుడు భారత్‌పై 50 శాతం భారీ టారిఫ్‌లు విధించిన ట్రంప్, ఇప్పుడు వాటిని 18 శాతానికి తగ్గించారు. ఇది ఆసియా దేశాలన్నింటిలో అత్యల్పం. ఈ టారిఫ్ తగ్గింపుతో పాటు మ్యాప్ విషయంలో ఇచ్చిన సపోర్ట్ భారత్‌కు దౌత్యపరంగా పెద్ద విజయంగా చెప్పాలి. ఇక్కడ వాణిజ్యం అన్నది సెకండరీ, మ్యాప్ ద్వారా అమెరికా ఇచ్చిన సపోర్ట్ ప్రైమరీ అని విశ్లేషకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
భారత్ ఎప్పుడూ కాశ్మీర్‌ను తన నుంచి విడతీయలేని భాగంగానే పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అమెరికా ధృవీకరణ అవసరం లేకపోయినప్పటికీ.. ప్రపంచ అగ్రరాజ్యం తన అధికారిక పత్రాల్లో భారత సరిహద్దులను సరైన రీతిలో చూపించడం వల్ల అంతర్జాతీయ వేదికలపై భారత్ వాదన మరింత బలోపేతం అవుతుంది. ఇది కేవలం సాంకేతిక పొరపాటా లేక ఉద్దేశపూర్వక వ్యూహమా అన్నది పక్కన పెడితే, భారత నెటిజన్లు మాత్రం ఈ 'సరైన మ్యాప్' చూసి సంబరపడిపోతున్నారు. మెుత్తానికి ఈ మ్యాప్ దౌత్య యుద్ధంలో భారత్‌కు ఒక తిరుగులేని ఆయుధంగా మారింది.
