ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ మిస్సింగ్‌‌‌‌!..లాయర్ సమక్షంలోనే విచారిస్తున్నాం: సీపీ సజ్జనార్‌‌‌‌

ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ మిస్సింగ్‌‌‌‌!..లాయర్ సమక్షంలోనే విచారిస్తున్నాం: సీపీ సజ్జనార్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేసు నమోదైన తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌తో పాటు కీలక ఆధారాలున్న అతడి ఐఫోన్‌‌‌‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. సమాచారం సేకరించేందుకు యత్నించినా కస్టడీ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు సహకరించలేదని తెలిసింది. 

తాను తాగిన మైకంలోనే  సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌ రాశానని  ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా సూసైడ్ నోట్ లభ్యం కాకపోవడంతో.. సోషల్‌‌‌‌మీడియాలో దానిని అప్‌‌‌‌లోడ్ చేసిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నోట్‌‌‌‌ ఎక్కడుందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా.. నిందితుడు పథకం ప్రకారమే సూసైడ్‌‌‌‌ నోట్‌‌‌‌, ఐఫోన్‌‌‌‌ను మాయం చేసినట్లు అనుమానిస్తున్నామని సీపీ సజ్జనార్‌‌‌‌ స్పష్టం చేశారు.

మరో మహిళ వద్ద రూ.15 లక్షలు వసూలు 

అకాడమీలో శిక్షణకు వచ్చిన కొద్ది రోజులకే ఉదయ్‌‌‌‌కృష్ణారెడ్డి తన క్రిమినల్ బ్రెయిన్‌‌‌‌కు పనిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌‌‌పై నాలుగు నెలల పాటు లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు, మరో మహిళతో ప్రేమాయణం నడిపినట్లు గుర్తించామని, ఆమె వద్ద నుంచి రూ.15 లక్షల నగదు కూడా తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. ఫోన్‌‌‌‌ను మాయం చేయడంతో పాటు ఇన్‌‌‌‌స్టాగ్రామ్ చాటింగ్‌‌‌‌ను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి డిలీట్ చేసినట్లు తేలింది. సాక్ష్యాలను నాశనం చేసే క్రమంలో తన సోదరుడి ఫోన్‌‌‌‌లోని డేటాను కూడా తొలగించాడు. ప్రస్తుతం ఉదయ్‌‌‌‌కృష్ణారెడ్డిని ఆయన లాయర్ సమక్షంలోనే విచారిస్తున్నామని, త్వరలోనే మరోసారి కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామని పోలీసులు పేర్కొన్నారు.