భారత్-అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్.. ఏఏ రంగాలకు లాభం అంటే..?

భారత్-అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్.. ఏఏ రంగాలకు లాభం అంటే..?

భారత్ అమెరికా మధ్య ఫిబ్రవరి 6, 2026న కుదిరిన మధ్యంతర ట్రేడ్ డీల్ రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఒప్పందం కింద అమెరికా.. భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలను భారీగా తగ్గించి 18 శాతానికి పరిమితం చేసింది. గతంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల కారణంగా విధించిన జరిమానాలతో కలిపి ఈ సుంకాలు దాదాపు 50 శాతం వరకు ఉండగా.. ఇప్పుడు వాటిని 18 శాతానికి తగ్గించడం భారత ఎగుమతిదారులకు లభించిన పెను ఊరట. దీనివల్ల టెక్స్‌టైల్, లెథర్ గూడ్స్, ప్లాస్టిక్స్, ఆర్గానిక్ కెమికల్స్, హస్తకళా రంగాలు అమెరికా మార్కెట్‌లో తిరిగి పోటీని ఎదుర్కొనే శక్తిని సాధించాయి.

ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మన పొరుగు దేశాలైన వియత్నాం, బంగ్లాదేశ్ , చైనాల కంటే తక్కువ టారిఫ్స్ ఉండటమే. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తుల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 232 కింద స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ఉన్న జాతీయ భద్రతా సుంకాలను కూడా అమెరికా తొలగించింది. ఇది భారత విమానయాన విడిభాగాల తయారీ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఫార్మా రంగంలో జెనరిక్ మందుల ఎగుమతులకు కూడా త్వరలో పూర్తిస్థాయి సుంకాల మినహాయింపు లభించనుందని తాజా డీల్ స్పష్టం చేస్తోంది.

ఇదే క్రమంలో భారత్ కూడా అమెరికాకు కొన్ని కీలక రాయితీలు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులైన ఫ్రూట్ జూసెస్, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ సుంకాలను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి భారత్ అంగీకరించింది. ముఖ్యంగా మెడికల్ డివైజెస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న నిబంధనలను సరళతరం చేయడం ద్వారా అమెరికన్ కంపెనీలకు భారత మార్కెట్ యాక్సెస్ పెంచింది ఇండియా. అంతేకాకుండా రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన ఎనర్జీ, విమానాలు, టెక్నాలజీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్న భారత ప్రతిపాదన రెండు దేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించడానికి దోహదపడనుంది.

టెక్నాలజీ, డిజిటల్ రంగంలో కూడా తాజా ట్రేడ్ డీల్ కీలక మార్పులకు నాంది పలికింది. డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అవసరమైన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPUs) సప్లై చైన్ బలోపేతం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇది భారత్‌లోని డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట వేయనుంది. మొత్తానికి ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా.. చైనాకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్‌ను కీలక శక్తిగా నిలబెట్టే వ్యూహాత్మక అడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ స్నేహపూర్వక ఒప్పందంతో భారత రూపాయి విలువ స్థిరపడటమే కాకుండా.. లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.